రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సంచలన ప్రకటన చేశారు. జియో త్వరలోనే ఒక ‘పీపుల్-ఫస్ట్’ (ప్రజలే ప్రథమం) ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
భారత్‌లో, భారత్ కోసం, ప్రపంచం కోసం దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.ఈ కొత్త ప్లాట్‌ఫాం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు, గుజరాత్ నుంచి మొదలుపెట్టి, తమ సొంత భాషలో, తమ సొంత డివైజ్‌పై ఏఐ సేవలను సులభంగా వినియోగించుకోవచ్చని అంబానీ వివరించారు. దీనివల్ల ప్రజల సామర్థ్యం, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌ను భారతదేశంలో ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.ఈ లక్ష్య సాధన కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, “జామ్‌నగర్‌లో మనం భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ-రెడీ డేటా సెంటర్ నిర్మిస్తున్నాం. దీని ఏకైక లక్ష్యం – ప్రతి భారతీయుడికి సరసమైన ఏఐ అందుబాటులో ఉంచడం” అని అంబానీ స్పష్టం చేశారు.



































