వాట్సాప్‌లో స్ట్రాంగ్ ఫీచర్ ఎంట్రీ రాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా ఒక ఫోన్లో ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ ఖాతాలను రన్ చేయవచ్చు.
త్వరలోనే మీరు ఒక ఫోన్లో ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ ఖాతాలను ఉపయోగించగలరు. డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక ప్రకారం, ఒక ఫోన్లో అనేక వాట్సాప్ ఖాతాలను ఉపయోగించే ఫీచర్ మీద కంపెనీ పనిచేస్తోంది. టెస్ట్ ఫ్లైట్ యాప్‌లో ఐఓఎస్ 25.19.10.74 కోసం వాట్సాప్ బీటాలో ఈ అండర్ డెవలప్‌మెంట్ ఫీచర్‌ను డబ్ల్యూఏబీటాఇన్ఫో చూసింది. ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో మీరు ఈ కొత్త ఫీచర్‌ను చూడవచ్చు. డబ్ల్యూఏబీటాఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం, అనేక ఖాతాల మధ్య మారే ఫీచర్‌ను కొత్త విభాగం నుండి యాక్సెస్ చేయవచ్చు.
ఈజీగా వేరే అకౌంట్‌లోకి
సెట్టింగ్స్ పేజీలోని ఆప్షన్ ద్వారా యూజర్లు యాప్‌లో రిజిస్టర్ అయిన అన్ని ఖాతాలను చూడగలుగుతారు. ఈ విభాగం యూజర్‌కు ప్రతి ఖాతా ప్రొఫైల్ పిక్చర్, పేరును చూపిస్తుంది. తద్వారా వినియోగదారులు సులభంగా వాటిని గుర్తించవచ్చు, మారవచ్చు. ఇప్పటికే ఉన్న ఖాతాల నుంచి డేటాను కోల్పోకుండా కొత్త ఖాతాలను యాప్‌లో యాడ్ చేసుకునేందుకు ఈ విభాగం వినియోగదారులను అనుమతిస్తుంది.
యూజర్లు యాక్టివ్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాట్సాప్ వెంటనే ఆ అకౌంట్‌కు మారుతుంది. ప్రత్యేకత ఏంటంటే ఆ అకౌంట్ చాట్ హిస్టరీ, ప్రిఫరెన్సెస్, సెట్టింగ్స్ కూడా యూజర్ ఇప్పటికే సెట్ చేసుకున్న విధంగానే ఉంటాయి. ఎలా అంటే మనం ఫేస్‌బుక్ యాప్‌లో వేరే అకౌంట్‌కి స్విచ్ అకౌంట్ వెళ్లిన్నట్టుగా ఇందులో వెళ్లవచ్చు అన్నమాట.
ఒకే డివైజ్‌లో అనేక అకౌంట్లు
ఖాతాల మధ్య మారడానికి వినియోగదారులు లాగ్ అవుట్ లేదా యాప్‌ను పునఃప్రారంభించాల్సిన అవసరం లేదని డబ్ల్యూఏబీటాఇన్ఫో తన నివేదికలో తెలిపింది. ఖాతాను మార్చినప్పుడు, వినియోగదారు స్క్రీన్ దిగువన ధృవీకరణ సందేశాన్ని చూస్తారు. ఇది ఖాతా విజయవంతంగా మార్చినట్టుగా చెబుతుంది. ఈ అప్‌డేట్ ద్వారా యూజర్లు ఒకే డివైజ్‌లో వేర్వేరు అకౌంట్లను మేనేజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని వాట్సాప్ భావిస్తోంది.
ప్రత్యేక నోటిఫికేషన్
ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రైమరీ అకౌంట్ ఉపయోగిస్తున్నప్పుడు సెకండరీ అకౌంట్లో మెసేజ్ వస్తే వాట్సాప్ తన ప్రత్యేక నోటిఫికేషన్‌ను చూపిస్తుంది. నోటిఫికేషన్లో పంపిన వ్యక్తి పేరుతో పాటు ఏ ఖాతాకు ఈ మెసేజ్ వచ్చిందో కూడా కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయడం ద్వారా, వినియోగదారు ఖాతా స్వయంచాలకంగా మారిపోతుంది. తద్వారా వారు అవసరమైన సంభాషణను కొనసాగించవచ్చు. వాట్సాప్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే కంపెనీ దీనిని పరీక్షించడం ప్రారంభించవచ్చు.
































