నా కుమారుడు మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు.. మోహన్‌బాబు భార్య లేఖ

www.mannamweb.com


మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. శనివారం నాడు మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.

ఈ విషయంపై పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

”డిసెంబర్‌ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు (Manchu Vishnu) జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్‌.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా ‘మేమిక్కడ పనిచేయలేమని’.. వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు’ అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.

మనోజ్‌ ఏం ఫిర్యాదు చేశాడంటే?

తల్లి పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్‌ ఆదివారం ఓ ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేయించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ”నేను సినిమా చిత్రీకరణలో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో.. నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్‌ కొండూరు, కిరణ్‌, విజయ్‌ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్‌ పోయించాడు. దాంతో, రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్‌ చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. విష్ణు టీమ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నా దంగల్‌ కోచ్‌ను బెదిరించింది. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం హృదయాన్ని కలచివేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా” అని మనోజ్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.