హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి, జనసేన విజయానికి తీవ్రంగా శ్రమించారు సినీ నటుడు, పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబు (Naga Babu). ముఖ్యంగా పిఠాపురంలో పవన్ విజయానికి అహర్నిశలు శ్రమించారు. ఈ నేపథ్యంలో నాగబాబు తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ పదవిని చేపట్టబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. గురువారం ఉదయం నుంచి ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయంపై నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. అంతేకాదు, తన భవిష్యత్ కార్యాచరణనూ వెల్లడించారు. ‘దయచేసి అసత్య వార్తలను ఎవరూ నమ్మకండి. పార్టీ అధికారిక, నా సోషల్‌మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ అయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు.
చిరంజీవి (Chiranjeevi) ఇంటికి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వచ్చిన సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్‌లోనూ నాగబాబు కుటుంబం పాల్గొంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కల్యాణ్‌బాబు విజయం సాధించిన సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి గెట్ టు గెదర్‌లా చిన్న పార్టీ చేసుకున్నామన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు వచ్చినట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ కుటుంబం పవన్‌కు అండగా ఉంటుందన్నారు. పార్టీకి సేవ చేయడం తప్ప పదవులపై తనకు ఆలోచన లేదన్నారు. జనసేనను ఇంకా ఉన్నతస్థానాలకు ఎలా తీసుకెళ్లాలా? అన్న ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం పైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు.