రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. కొత్త సీఎస్‌గా ఆయన పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎస్‌గా ఆయన నియామకంపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారులనూ నియమించే అవకాశం ఉంది.