NEET Paper Leak: ఒక్కో పేపర్‌ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు

www.mannamweb.com


NEET Paper Leak: ఒక్కో పేపర్‌ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు

పట్నా: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సీబీఐకి అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాలను రూ.35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారు.

నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు రూ.35 నుంచి 45 లక్షలకు విక్రయించగా, బీహార్ వెలుపలి విద్యార్థులకు రూ.55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.

గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ విక్రయాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నా పత్రాలను అందించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది.

దర్యాప్తులో ఎన్‌టీఏ పలువురు అనుమానిత విద్యార్థుల పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయూ ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్‌బాద్‌లో అరెస్టయిన అవినాష్ కుమార్ అలియాస్ బంటీని ఆరు రోజుల పోలీసు రిమాండ్‌పై సీబీఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సీబీఐ విచారించనుంది.