NEET-UG Paper Leak Case: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌.. ఇప్పటివరకు ఎందరు అరెస్టయ్యారంటే!

www.mannamweb.com


నీట్‌ యూజీ పేపర్ లీక్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది.

అరెస్టవారిలో ఒకరు నీట్‌ అభ్యర్థి కాగా, మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రిగా సీబీఐ వెల్లడించింది. వీరిద్దరూ బీహార్‌కు చెందినవారిగా దర్యాప్తు సంస్థ తెలిపింది. నీట్‌-యూజీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నీట్‌ అభ్యర్థిని సీబీఐ నేరుగా అరెస్టు చేయడం ఇదే తొలిసారి. తాజాగా అరెస్ట్‌ అయిన ఇద్దరిలో ఒకరు నలందకు చెందిన నీట్‌-యూజీ అభ్యర్థి సన్నీ, మరొకరు గయాకు చెందిన మరో అభ్యర్థి తండ్రి రంజిత్‌ కుమార్‌గా సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 11కు చేరిందని అధికారులు మంగళవారం (జులై 9) తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు బీహార్ నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 8 మందిని, గుజరాత్‌లోని లాతూర్, గోద్రాలో ఇద్దరిని, డెహ్రాడూన్‌కు చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాలకు నీట్‌ యూజీ 2024 పరీక్షనుఈ ఏడాది మే 5న విదేశాల్లో 14 సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పేపర్‌ లీక్‌తోపాటు గ్రేస్‌ మార్కులు కలపడంపై దుమారం రేగింది. పైగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి కొత్త ర్యాంకు కార్డులు జారీ చేసింది. మరోవైపు నీట్‌ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటన్నింటినీ కోర్డు విచారిస్తోంది. విచారణ పూర్తయ్యేంత వరకు నీట్ కౌన్సెలింగ్‌ నిర్వహించకూడదని కోర్టు ఆదేశించడంతో.. అప్పటి వరకు కేంద్రం కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది.