దిల్లీ: సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. సాయంత్రం కురిసిన భారీవర్షానికి భవనంలోని సెల్లార్‌లో నిర్వహిస్తున్న రావూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరదనీరు చొచ్చుకుపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్ చేపట్టిన సహాయకచర్యలతో విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబం ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాలలో నివసిస్తోంది. శ్రేయా యూపీ, నవీన్ కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. తాన్యా సోని కుటుంబ స్వస్థలం బిహార్‌లోని ఔరంగాబాద్ కాగా.. ఆమె తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు.
దిల్లీలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలరుకు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు.
విద్యార్థుల ఆందోళన.. పోలీసుల జోక్యం
ప్రమాదం జరిగిన ఐఏఎస్ స్టడీ సర్కిల్ వద్ద ఆదివారం వందల సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ కరోల్‌బాగ్ మెట్రోస్టేషనుకు వెళ్లే రహదారిని దిగ్బంధం చేశారు. పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని బస్సులో తరలించారు. ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఘటనా స్థలాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, నేనూ వెళ్లాం. మురుగునీరు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చిందని స్థానికులు చెప్పారు. చట్టాలకు విరుద్ధంగా సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం’’ అన్నారు. ఆ ప్రాంతంలో మురుగునీరు వెళ్లే కాలువలు ఆక్రమణకు గురై పూడుకుపోయినట్లు ఎంసీడీ అధికారి తెలిపారు. ఈ దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు దిల్లీ రెవెన్యూ మంత్రి ఆతిశీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఈ ఘటనలో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, అధికారుల తీరును శ్రేయా యాదవ్ అంకుల్ ధర్మేంద్ర యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. వీళ్లెవరూ తమకు సమాచారం ఇవ్వలేదని, టీవీ వార్తల్లో చూసే విషయం తెలుసుకున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి మార్చురీ వద్ద విద్యార్థుల మృతదేహాలను చూసేందుకు తమను అనుమతించలేదని స్నేహితులు, బాధిత కుటుంబాలవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సురక్షితం కాని నిర్మాణాలకు సామాన్యులు బలి: రాహుల్
ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం, సురక్షితం కాని నిర్మాణాలకు సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ ఘటనలో మృతుల కుటుంబాలకు ‘ఎక్స్’ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం, అధికార యంత్రాంగాల నేరపూరిత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. గత వారం పటేల్ నగర్‌లోనూ వర్షపునీటి కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ సివిల్స్ విద్యార్థి మృతిచెందినట్లు ఆయన గుర్తు చేశారు. ఇది హృదయ విదారకమైన దుర్ఘటన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. వర్షపునీటి సమస్యను స్థానికులు రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ దృష్టికి రెండుసార్లు తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదని, ముగ్గురు విద్యార్థుల మృతికి కేజ్రీవాల్ ప్రభుత్వమే కారణమని న్యూ దిల్లీ ఎంపీ బాంసురీ స్వరాజ్ ధ్వజమెత్తారు.
భవనం గేటు విరగ్గొట్టిన ఫోర్ వీలర్!
దిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో కోచింగ్ సెంటర్ భవనం ముందు భారీగా చేరిన వరదనీటిలో నుంచి ఓ ఫోర్ వీలర్ వాహనం వేగంగా దూసుకుపోయిందని, బలంగా తాకిన నీటి అలల ధాటికి గేటు విరిగి వరదనీరు సెల్లార్‌లోకి ప్రవహించినట్లు ఓ వీడియో కథనం వెల్లడించింది.
స్టోర్ రూంలో గ్రంథాలయం..పనిచేయని బయోమెట్రిక్ ద్వారం!
స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ ఎం.హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందన్నారు. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని, సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపునీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని వస్తున్న వార్తలపై విచారణ చేస్తామని తెలిపారు. ఆ సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు. ఈ దుర్ఘటన తమను కలచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సోని చిన్ననాటి కల
తండ్రి విజయ్‌కుమార్
దిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనలో దుర్మరణం చెందిన తాన్యా సోనీకి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సివిల్ సర్వెంటుగా సేవలు అందించాలనేది చిన్ననాటి కలగా ఆమె తండ్రి విజయ్‌కుమార్ తెలిపారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ.. ‘‘దిల్లీలోనే రాజనీతిశాస్త్రంలో బీఏ పట్టా పొందిన తాన్యా నెల రోజుల కిందటే సివిల్స్ శిక్షణలో చేరింది. మా కుటుంబం రైలులో లఖ్‌నవూ వెళుతుండగా ఈ దుర్వార్త అందింది. నాగ్‌పుర్‌లో రైలు దిగి విమానంలో దిల్లీకి చేరుకున్నాం. తాన్యా మృతదేహంతో ఇపుడు మా స్వరాష్ట్రమైన బిహార్‌కు బయలుదేరాం’’ అని చెప్పారు.