Netflix Webseries: ‘రానా నాయుడు 2’, ‘టెస్ట్‌’: ‘నెట్‌ఫ్లిక్స్‌’లో రిలీజ్‌ కానున్న సిరీస్‌లు, సినిమాలివే..

తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై త్వరలో విడుదల కానున్న ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు, కొన్ని సినిమాల జాబితాను ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Upcoming Webseries and Movies in Netflix) సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల టీజర్లను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. వాటిలో సీక్వెల్స్‌ కూడా ఉండడం గమనార్హం. వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘రానా నాయుడు 2’ (Rana Naidu 2) రానుంది. కీర్తి సురేశ్‌, రాధికా ఆప్టే కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘అక్క’ (Akka). ఈ రివెంజ్‌ డ్రామా త్వరలోనే విడుదల కానుంది. కీర్తి సురేశ్‌కు ఇది తొలి వెబ్‌సిరీస్‌. సందీప్‌ కిషన్‌ ‘సూపర్‌ సుబ్బు’, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కోహ్రా’ సీజన్‌ 2, ‘దిల్లీ క్రైమ్‌’ సీజన్‌ 3, ‘గ్లోరీ’, ‘మండలా మర్డర్స్‌’, ‘ది రాయల్స్‌’, షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ తదితర సిరీస్‌లు ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’ సీజన్‌ 3 కూడా రాబోతోంది.


సినిమాలివీ..
మాధవన్‌, నయనతార, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మూవీ ‘టెస్ట్‌’, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో రాబీ గ్రేవాల్‌ రూపొందించిన యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘జ్యువెల్‌ థీఫ్‌’ (Jewel Thief), రాజ్‌కుమార్‌ రావు, సాన్యా మల్హోత్ర ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘టోస్టర్‌’, మాధవన్‌ హీరోగా రూపొందిన ‘ఆప్‌ జైసా కోయి’ (Aap Jaisa Koi), సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘నాదానియా’ ఈ ఓటీటీలోనే సందడి చేయనున్నాయి.

మీ ముందుకొచ్చినందుకు ఆనందంగా ఉంది: సైఫ్‌ అలీఖాన్‌
ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన ఈవెంట్‌కు వెంకటేశ్‌, రానా, కీర్తి సురేశ్‌, సైఫ్‌ అలీఖాన్‌, షారుక్‌ ఖాన్‌ తదితరులు హాజరై సందడి చేశారు. దుండగుడి దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స అనంతరం సైఫ్‌ డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పాల్గొన్న తొలి కార్యక్రమమిదే. ‘మీ ముందుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. హెయిస్ట్‌ మూవీలో నటించాలన్న డ్రీమ్‌ ఈ ‘జ్యువెల్‌ థీప్‌’తో నెరవేరింది’’ అని పేర్కొన్నారు.

ఇద్దరు పవర్‌ఫుల్‌ మహిళల కథే ‘అక్క’ అని కీర్తి సురేశ్‌ తెలిపారు. ఇప్పటి వరకూ ప్రేక్షకులు చూడని కొత్త ప్రపంచాన్ని ఈ సిరీస్‌తో చూస్తారని పేర్కొన్నారు. ‘రానా నాయుడు’ కంటే ‘రానా నాయుడు 2’ మరింత ఆసక్తికరంగా ఉంటుందని రానా అన్నారు.