గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4.. కొత్త ఎయిర్‌పోర్టులు

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లో కొత్త రెక్కలు విచ్చుకోనున్నాయి. ఏపీలో ఆరు, తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

ఏపీలోని ఆరు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. ఫీజిబిలిటీ స్టడీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలులో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం నుండి కూడా సానుకూల స్పందన రావడంతో..ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఇక తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో పాటు బేగంపేట ఎయిర్‌పోర్టు మాత్రమే ఉంది. వీటికి అదనంగా రామగుండం, మామునూరు, కొత్తగూడెంలో కొత్తగా ఎయిర్‌పోర్టులను నిర్మించాలని భావిస్తోంది..రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. మామునూరు ఎయిర్ పోర్టుకు ఇప్పటికే ఎన్‌ఓసీ సాధించామని..దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయాన్ని 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.

డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలుస్తామన్నారు..కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలను కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లాలోని మామునూరులో ఎయిర్‌పోర్ట్‌..స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉంది. దాదాపు 32 ఏళ్ల కిందట ఇది మూతపడింది. దీన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో..మామునూరు విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు రానున్నాయి. దీంతో విమానయానం చేయాలన్న ఓరుగల్లు వాసుల కల సాకారం కాబోతుంది. అటు వరంగల్‌ అభివృద్ధికి కూడా మామునూరు ఎయిర్‌పోర్టు కీలకం కానుంది.