తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీ వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమిస్తూ రేవంత్ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీతో పాటు హోంశాఖ స్పెషల్ సెక్రెటరీ పోస్ట్‌ను కూడా భర్తీ చేసింది ప్రభుత్వం. హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా రవిగుప్తాను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నయా డీజీపీ జితేందర్ బ్యాగ్రౌండ్ తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరు ఆయన? ఎక్కడ నుంచి వచ్చారు? ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జితేందర్ గురించి ఇప్పుడు మరింతగా తెలుసుకుందాం..
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని ఓ రైతు కుటుంబంలో పుట్టారు జితేందర్. కెరీర్లో అహర్నిషలు శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్.. తొలుత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు సెలెక్ట్ అయ్యారు. మొదట నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ రోజుల్లో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ ఆయన పనిచేశారు. 2004-06 దాకా సీబీఐ, గ్రేహౌండ్స్‌లో కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ రావడంతో విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొన్నాళ్లు పని చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా వర్క్ చేశారు.
ఏపీ సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎంక్వయిరీ కమిషన్‌లో పని చేసిన తర్వాత హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు జితేందర్. అనంతరం తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా పని చేశారు. అలాగే జైళ్ల శాఖ డీజీగానూ వర్క్ చేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు జితేందర్. ఇప్పుడు డీజీపీగా నియమితులైనందున 14 నెలల పాటు ఆ పోస్ట్‌లో ఆయన కొనసాగనున్నారు. కొత్త డీజీపీ జితేందర్‌కు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన శాంతిభద్రతల్ని కాపాడాలని కోరుకుంటున్నారు.