తెలంగాణలో కొత్త ఇంధన విధానం.. 35 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం..!

www.mannamweb.com


తెలంగాణ రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని ఇటీవల చేపట్టిన అధ్యయనం ద్వారా వెల్లడైంది. రాష్ట్రాలవారీగా సౌర, పవన విద్యుత్తుతో పాటు, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల (పీఎస్పీ) ద్వారానూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలించి ఎంఎన్‌ఆర్‌ఈ కీలక వివరాలు సేకరించింది.

ఈ అధ్యయనం ప్రకారం, తెలంగాణలో రోజువారీ 35,100 మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం స్థాపిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా కేవలం 6,200 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని వెల్లడైంది. .

సామర్థ్యం పెంపు అవసరం

తెలంగాణలో ప్రస్తుతం సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 15,747 మెగావాట్లుగా ఉంది. హరిత ఇంధనాన్ని పూర్తిగా వినియోగించినట్లయితే, ఈ డిమాండ్ కంటే రెట్టింపు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, హరిత ఇంధన ఉత్పత్తిని పెంచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలకు అందిస్తోంది. ఇందు కోసం కేంద్రం రూ. 18,853 కోట్లు కేటాయించినట్టు కేంద్ర పునరుత్తేజక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఎ) పేర్కొంది.

దేశవ్యాప్తంగా లక్ష్యాలు

2030 నాటికి దేశంలో హరిత ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు చేరువ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపు కోసం పలు కేంద్ర పథకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన’ కింద సబ్సిడీతో సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వబడుతున్నప్పటికీ, తెలంగాణలో కేవలం 4,300 ఇళ్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి.

పీఎం కుసుమ్ పథకంపై స్పందన లేకపోవడం

వ్యవసాయ బోర్ల వద్ద సౌర విద్యుత్ ఏర్పాటుకు కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం కుసుమ్’ పథకం కింద కూడా రాష్ట్రంలో ఆశించిన స్పందన లభించలేదు. పంటలు లేని సమయంలో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, అది రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కి సరఫరా చేస్తే, రైతులకు యూనిట్‌కి రూ. 3 చెల్లించనున్నట్లు డిస్కంల నిబంధన ఉంది. దీనివల్ల రైతులకు అదనంగా ఆదాయం వస్తుంది, అయినప్పటికీ స్పందన కొరవడిందని ఎంఎన్‌ఆర్‌ఈ స్పష్టం చేసింది.

తెలంగాణలో కొత్త ఇంధన విధానం

తెలంగాణలో త్వరలోనే కొత్త నూతన ఇంధన విధానం అమలులోకి రానుందని, రాష్ట్రం పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు జాతీయ జల విద్యుత్ సంస్థ సహకరించడానికి ముందుకొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.