తిరుమల గదుల కేటాయింపుల్లో కొత్త విధానం – ఇక నుంచి వీరికే, ఇలా తప్పనిసరి

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కొద్ది రోజులుగా వరుస మార్పులను టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్య కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది.


శ్రీవారి దర్శనం త్వరగా జరిగేలా క్యూ లైన్ మేనేజ్ మెంట్ లో కొత్త విధానాలను ప్రారంభించింది. తాజాగా శ్రీవాణి దర్శనం లో మార్పులు తీసుకొచ్చింది. ఇక, ఇప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు వసతి విషయం లోనూ మార్పులు అమలుకు టీటీడీ సిద్దమైంది.

తిరుమలలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల కు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా టీటీడీ నిర్ణయం తీసుకుంటోంది. తెలంగాణ కు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. దీంతో, వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ పైన ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా శ్రీవాణి దర్శనం వేళల్లో నూ టీటీడీ ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది. ఇక..బ్రేక్ దర్శనాలను ఉదయంతో పాటుగా సాయంత్రం సమయంలోనూ అమలు దిశగా టీటీడీ కసరత్తు చేస్తోంది. త్వరలో నే ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు వసతి విషయంలో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది.

ఇప్పటి వరకు సిఫారసు లేఖల పైన వచ్చిన భక్తులకు దర్శనంతో పాటుగా వసతికి టికెట్లు జారీ చేసే వారు. అయితే, వసతి కోసం పెరుగుతున్న డిమాండ్ తో టీటీడీ కొత్త విధానం ప్రారంభించింది. సిఫారసు లేఖల పైన వచ్చిన వారు దర్శనం టికెట్ తీసుకుంటేనే వారికి వసతి కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం ముందుగా కొన్ని కేటగిరీల వసతి కేటాయింపుల్లో ఈ విధానం అమలు చేస్తోంది. TBC, ARP, MBC, పద్మావతి వసతి సముదాయాల వద్ద దర్శనం టోకెన్లు ఉన్న వారికే వసతి కేటాయింపు లు చేస్తూ కొత్త విధానం అమలు చేస్తోంది. అయితే, సాధారణ భక్తులకు మాత్రం సీఆర్వో వద్ద రిజిస్ట్రేషన్ విధానంలో వసతి కేటాయిస్తున్నారు. దీని ద్వారా వసతి మరింత మంది భక్తులకు కల్పించేందుకే ఈ విధానం అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.