AP Railway Zone: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. పదేళ్లుగా ఊరిస్తున్న రైల్వే జోన్ విషయంలో రకరకాల అటంకాలు ఎదురయ్యాయి.రైల్వే జోన్ భూమి విషయంలో కూడా గత ప్రభుత్వంలో అటంకాలు ఎదురయ్యాయి. తాజాగా జోన్ ఏర్పాటుపై మంత్రి కీలక ప్రకటన చేశారు.
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దాదాపు పదేళ్లుగా జోన్ ఏర్పాటు వ్యవహారం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రైల్వే జోన్‌కు శంకుస్థాపన అంటూ వైసీపీ నేతలు హడావుడి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వే జోన్ ఏర్పాటు, భవనాల నిర్మాణానికి శంకుస్థాపన అంటూ పెద్ద ఎత్తున హడావుడి జరిగింది.
విభజన హామీల్లో ప్రధానమైన విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కీలక ముందడుగు పడనుంది. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ నిరీక్షణ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు త్వరలో నెరవేరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సోమవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేవారు.
విశాఖపట్నం కేంద్రంగా త్వరలో రైల్వేజోన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు వివరించారు. రైల్వే జోన్‌కు అవసరమైన భూ కేటాయింపు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు.
అతి త్వరలో జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమి విషయంలో అభ్యంతరాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో వేరేచోట భూమి కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని, భూ కేటాయింపుపై నెలకొన్న వివాదాలు పరిష్కారం అయ్యాయని, జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ దాదాపుగా తొలిగి పోయాయని చెప్పారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో పురోగతి ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయని చెప్పారు.
ఫిబ్రవరిలో శంకుస్థాపన అంటూ జనవరిలో హడావుడి…
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో వైసీపీ హడావుడి చేసింది.
ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నట్లు మాజీ ఎంపీ సత్యవతి అప్పట్లో హడావుడి చేశారు. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వేజోన్ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని కూడా రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్‌డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని చెప్పారు.
విశాఖపట్నం ప్రధాని వచ్చినపుడు కూడా రైల్వే జోన్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. విశాఖలోని ఏయూ ప్రాంగణంలో నిర్వహించిన సభలో రైల్వే జోన్ ప్రస్తావన లేకుండానే బహిరంగ సభను నిర్వహించారు.