రూ.లక్ష కోట్లతో కేంద్రం కొత్త పథకం.. సంస్థలు, ఉద్యోగులకు ప్రోత్సాహకాలు

దేశంలో కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ ఉపాధి యోజన (PM Viksit Bharat Rozgar Yojna)’ పేరిట పోర్టల్‌ను ప్రారంభించింది. యజమానులు, తొలిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్‌ జులై 1న ఆమోదం తెలిపింది. పథకం ద్వారా రూ.లక్ష కోట్లతో వచ్చే రెండేళ్లలో (2025 ఆగస్టు 1 – 2027 జులై 31) 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఈ పథకాన్ని పార్ట్‌ ఏ, పార్ట్‌ బీ అని రెండు భాగాలుగా విభిజించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. పార్ట్‌ ఏ కింద మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అంటే సగటున ఒక నెలజీతం (Basic+DA), గరిష్ఠంగా రూ.15 వేల వరకు ఉంటుంది. ఇది రెండు విడతల్లో చెల్లిస్తారని ఆయన తెలిపారు. రూ.లక్ష వరకు గ్రాస్‌ వేతనం పొందే ఉద్యోగులందరూ పార్ట్‌- ఏ కిందకు వస్తారు. ఇక పార్ట్‌ బీ కింద యజమానులకు మద్దతు ఇస్తారు. వీరికి మూడు స్లాబుల్లో ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగి నెలజీతం రూ.10 వేల అయితే యజమానికి రూ.1000 ప్రోత్సాహకం అందుతుంది. అలాగే ఉద్యోగి నెలజీతం రూ.10 – 20 వేల మధ్య ఉంటే యజమానికి రూ.2 వేలు.. రూ.30 వేల వరకు జీతం ఉంటే యజమానికి రూ.3 వేల ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది కేవలం ఒక ఉద్యోగికి ఒకసారి మాత్రమే వర్తిస్తుంది.  ఈ పథకం ద్వారా ముఖ్యంగా తయారీరంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

పార్ట్‌-బీలో ప్రతి అదనపు ఉద్యోగి (తొలిసారి చేరినవారు, రీ-జాయినీ)పై సంస్థకు నెలకు గరిష్ఠంగా రూ.3 వేల వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఉద్యోగి కనీసం ఆరునెలలపాటు కొనసాగితే ఈ ప్రోత్సాహకం రెండేళ్ల పాటు చెల్లిస్తారు. తయారీ రంగంలోని సంస్థలకు మాత్రం ఇది నాలుగేళ్లపాటు లభిస్తుంది. దీనికి అర్హత పొందాలంటే.. 50 మందికి తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 మందికి ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని అదనంగా నియమించుకోవాలి. వీరిని కనీసం ఆరు నెలలపాటు కొనసాగించాల్సి ఉంటుంది. EPF & MP చట్టం 1952 కింద మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఈ పథకంలో భాగమేనని మంత్రి తెలిపారు. సంస్థలు తమ ప్రస్తుత, కొత్త ఉద్యోగులకు యూఏఎన్ తెరవడం, UMANG యాప్ ద్వారా ఈసీఆర్‌ ఫైలింగ్‌ చేయడం తప్పనిసరి అని వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.