Nepal: నేపాల్ దేశం తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడంతో నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం నాడు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్తపటం ఏర్పాటు చేసింది. ఇక, దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ది కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా ఇండియా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదని క్లారిటి ఇచ్చింది.
ఇక, ప్రధాని పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలో సమావేశమైన మంత్రి మండలి రూ. 100 నోట్లపై నేపాల్ పాతపటం స్థానంలో కొత్తపటం ముద్రణకు నిర్ణయం తీసుకొన్నట్లు ఆ దేశానికి చెందిన సమాచార, ప్రసార శాఖ మంత్రి రేఖాశర్మ మీడియాకు తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్ 2020 జూన్‌లో రాజ్యాంగ సవరణ కూడా చేసినట్లు తెలుస్తుంది. సరిహద్దులో వ్యూహాత్మకంగా ఉన్న కీలకమైన పై మూడు భూభాగాలు తమకు చెందినవిగా భారత్ తెలియజేస్తుంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్.. ఐదు భారత రాష్ట్రాలతో నేపాల్ 1,850 కిలో మీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.