తిరుపతికి కొత్తగా వందేభారత్, ముహూర్తం ఫిక్స్ – రూట్.. షెడ్యూల్

తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ ఒక శుభవార్త అందించింది. తిరుపతికి ప్రయాణించే వారికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది.ఈ రైలుకు కొద్ది నెలల క్రితమే ఆమోదం దక్కినా..


ఆలస్యం అయింది. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది. విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణించే ఈ రైలు తిరుపతి మీదుగా వెళ్లడం వల్ల శ్రీవారి భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ఈ రైలు ద్వారా కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు కు.. నాలుగున్నార గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు.

రైల్వే శాఖ విజయవాడ నుంచి మరో వందేభారత్ పట్టాలెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి కే విజయవాడ నుంచి చెన్నై వరకు నడుస్తున్న వందేభారత్ ను తాజాగా నర్సాపురం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుడివాడ, భీమవరం లో హాల్ట్ సౌకర్యం కల్పించారు. కాగా, తాజాగా విజయవాడ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ ను ఈ నెలాఖరు నుంచి నడిపేందుకు నిర్ణయించారు.

ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుందని అధికారులు వెల్లడించారు.

ఈ కొత్త వందేభారత్ కు నెంబర్ తో పాటుగా రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది.

అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు అందు బాటులోకి రావటం ద్వారా తిరుపతి.. బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.