తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న మూవీ పైరసీ వెబ్ సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని కూకట్‌పల్లిలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే HD ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ సైట్లో విడుదల చేస్తున్న రవిపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఐ-బొమ్మ నిర్వాహకుడు. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు.
దీంతో ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడి కోసం గత 6 నెలలుగా వేట ప్రారంభించారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా స్కెచ్ వేసి 2025, నవంబర్ 15న కూకట్ పల్లిలో అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్లో రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న రవి.. కరేబియన్ దీవుల్లో ఉంటూ iBomma వెబ్ సైట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అనే వార్తతో సినీ దర్శక, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.
































