ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ శుభవార్తలే అందుతున్నాయి. ఇప్పటికే దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యల పరిష్కారంతో పాటు విభజన హామీల్ని కూడా అమలు చేస్తున్న కేంద్రం..
తాజాగా ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ చేపడుతున్న పనుల్లో భాగంగా ఏపీలోనూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు.
రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలతో పాటు చిన్న చిన్న గ్రామాలకు సైతం దశాబ్దాలుగా రైల్వే గేట్లు, లెవెల్ క్రాసింగ్స్ సమస్య ఉంది. వీటి వల్ల రైల్వేకు ఎన్నో ఏళ్లుగా అదనంగా సిబ్బంది కేటాయింపులతో పాటు స్థానికంగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వేశాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఇలాంటి రైల్వే గేట్లను తొలగించి వాటి స్ధానంలో వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.
2027 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే గేట్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్న కేంద్రం వాటి స్ధానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జులను నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉన్న రైల్వే గేట్లపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 390 రైల్వే గేట్లు ఉన్నట్లు తేల్చారు.
వీటిలో 100గేట్లను ఇప్పటికే సర్వే చేసేసిన అధికారులు మరికొన్ని రోజుల్లో మిగిలిన గేట్లను కూడా పరిశీలించి ప్రతిపాదనలు ఇస్తారు. వీటి ఆధారంగా నిధులు కేటాయించి రైల్వే గేట్ల స్ధానంలో వంతెనలు నిర్మించనున్నారు. దీని వల్ల దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు ప్రజలకు భారీగా సమయం కూడా ఆదా కాబోతోంది.