పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.వేల కోట్ల మేర మోసగించి యూకే పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) అప్పగింత వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. నవంబరు 23న నీరవ్‌ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
అప్పగింత ప్రక్రియకు (Nirav Modi Extradiction) సంబంధించి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీపత్రం అందజేసింది. నీరవ్‌ను భారత్‌కు తీసుకొచ్చాక కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. అంతేగాక, భారత్‌కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచనున్నట్లు అందులో పేర్కొన్నారట. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించినట్లు సమాచారం.
తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ ఇటీవల నీరవ్ మోదీ మరోసారి కోర్టును ఆశ్రయించిన (Nirav Modi Moves UK Court) సంగతి తెలిసిందే. తనను భారత్‌కు అప్పగిస్తే దేశంలోని బహుళ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. నవంబరు 23న తదుపరి విచారణ సమయంలో అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
ఏంటీ కేసు..?
తప్పుడు ఎల్‌వోయూలతో పీఎన్‌బీని (PNB Scam) నీరవ్ మోదీ మోసగించిన వైనం 2018 జనవరిలో వెలుగుచూసింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయాడు. ఈడీ అతడిని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబరులో బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతడిని భారత్‌కు అప్పగించడానికి 2021లో అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ అతడు లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసినా అన్నిసార్లు భంగపాటుకు గురయ్యాడు.
































