కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ(శనివారం) ఉదయం 11 గంటలకు బడ్జెట్ 2025-26 (Budget 2025-26) ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
ఈసారి ఆమె సమర్పించే బడ్జెట్‌తో వరసగా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా చరిత్ర లిఖించనున్నారు. అయితే ప్రతి ఏటా ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్‌తోపాటు కేంద్రమంత్రి ధరించే చీరపైనా పెద్దఎత్తున ఆసక్తి నెలకొంటుంది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపటేలా ప్రతి ఏటా బడ్జెట్ రోజున నిర్మల ప్రత్యేకంగా రూపొందించిన చీరను ధరిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చేనేత చీర (Handloom saree)ను నిర్మలా సీతారామన్ ధరించారు. ఆమె సాధారణంగా బడ్జెట్ వేళ చేనేత చీరలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈసారి ధరించిన చీరలో బిహార్ రాష్ట్రం మధుబని కళకు చెందిన చిత్రాలు కనిపిస్తున్నాయి.
కాగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఈ చీరను నిర్మలకు 2021లో బహుమతిగా ఇచ్చారు. ఆ చీరనే నేడు కేంద్ర మంత్రి ధరించారు. మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ యాక్టివిటీ కోసం కేంద్రమంత్రి ఓసారి మధుబనీకి వెళ్లారు. అక్కడ దులారి దేవిని నిర్మల కలిశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రమంత్రికి చీరను బహుమతిగా ఇచ్చారు. కాగా, ప్రస్తుతం బడ్జెట్‌పై ఎంత ఆసక్తి నెలకొందో ఆర్థిక మంత్రి నిర్మల కట్టుకున్న చీరపైనా అంతే ఆసక్తి నెలకొంది.
గత చీరలు ఇవే..
2019లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతి ఏటా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రకాల చీరలు ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ చీరలు వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్నాయి. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. ఆ ఏడాది తెలుపు రంగు, గోల్డ్ మోటిఫ్స్‌తో ఉన్న మెజెంటా బోర్డర్ సిల్క్ శారీలో కేంద్రమంత్రి కనిపించారు. అలాగే ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా బ్లూ కలర్ చేనేత చీరలో ఆమె దర్శనం ఇచ్చారు. అప్పుడు ధరించిన హ్యాండ్లూమ్ శారీపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. దీన్ని అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా ధరించినట్లు తెలిపారు. 2023 బడ్జెట్ సమయంలో ఎరుపు రంగు టెంపుల్ బోర్డర్‌తో ఉన్న చీరను కేంద్ర మంత్రి కట్టుకున్నారు. 2022 బడ్జెట్ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన మెరూన్ కలర్ చేనేత చీరను నిర్మల ధరించారు. 2021లో రెడ్- బ్రౌన్ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2020 బడ్జెట్ సందర్భంగా ఆస్పిరేషన్ ఇండియా ఇతివృత్తంతో రూపొందించిన నీలం రంగు అంచు గల పసుపుపచ్చ- బంగారు వర్ణం చీరను ఆమె కట్టుకున్నారు. 2019లో తన తొలి బడ్జెట్ నాడు మంగళగిరి గులాబీ రంగు చీరను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధరించారు