అమరావతి: ఏపీకి రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సమిత్ తెలిపారు.
అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.
అఖిలభారత పంచాయతీ పరిషత్ ఏపీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాసిన లేఖను.. ప్రధాని కార్యాలయం ఆర్‌బీఐకి పంపించింది. దీంతో రిజర్వు బ్యాంకు అధికారులు ఆ లేఖకు సమాధానమిచ్చారు. రాజధాని విషయం తేలనందునే కార్యాలయం ఏర్పాటు చేయలేదని వీరాంజనేయులుకు ఆర్‌బీఐ లేఖ పంపింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆర్‌బీఐ అధికారులు అందులో సమాధానమిచ్చారు. దీనిపై జాస్తి వీరాంజనేయులు ఆగ్రహం వెలిబుచ్చారు. ”2016లోనే అమరావతిలో ఆర్‌బీఐకి అప్పటి తెదేపా ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వ మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించింది. పార్లమెంట్ సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని ప్రకటించింది. అయినా, ఆర్‌బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్టు సమాధానమివ్వడం దారుణం” అని వ్యాఖ్యానించారు.