ఎన్నిసార్లు చెప్పినా మీరింతేనా..? ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌పై సీఎం రేవంత్ ఫైర్

 ‘మీరు మారరా? ఎన్ని సార్లు చెప్పినా మీ పని తీరు ఇంతేనా? తక్కువ వేతనాలున్న, అవుట్​సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా చెల్లించాలని గతంలో ఆదేశించాను కదా..


మరి ఎందుకు అమలు చేయట్లేదు’. అంటూ ఆర్థిక శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎంప్లాయీస్ వేతనాలను గ్రీన్‌చానల్​ద్వారా చెల్లించాలని గతంలో ఆదేశించానని, అయినా సకాలంలో శాలరీలు వేయడం లేదని.. జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్, ఎస్‌బీ, ఉద్యోగ సంఘాల ద్వారా తనకు సమాచారం చెప్పినట్టు టాక్. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి.. ఆర్థిక శాఖ అధికారులు, సీఎస్,​ఇతర శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు, అవుట్​సోర్సింగ్​ఉద్యోగుల వేతనాలపై చర్చ జరిగిందని, వారికి సకాలంలో వేతనాలు ఎందుకు అందడంలేదని అధికారులను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం.

వేతనాలు ఇవ్వకుంటే ఇబ్బంది పడరా?

కాంట్రాక్టు, అవుట్​సోర్సింగ్​ఉద్యోగులకు గ్రీన్ ఛానెల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని తాను గతంలోనే ఆదేశించానని, అయినా ఎందుకు అమలు చేయడం లేదని సీఎం ఆఫీసర్లను నిలదీసినట్టు తెలిసింది. దీనికి ఆర్థిక శాఖ అధికారులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని సీఎం.. వారికి తక్కువ మొత్తంలో జీతాలు ఉంటాయని, అవి సైతం సమాయానికి ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించినట్టు సమాచారం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెగ్యులర్​ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇవ్వడం ప్రారంభించామని గుర్తుచేసినట్టు టాక్. చిరు ఉద్యోగులకు వేతనాలను స్ట్రీమ్​లైన్​చేయాలని, మొదటి వారం కల్లా అందితే వారు ఉత్సాహంగా పని చేస్తారని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని, పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తారని సూచించినట్టు తెలిసింది. వచ్చే నెల నుంచి లక్షలాది మంది రెగ్యులర్​ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్​సోర్సింగ్​ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించాలని, ఇందులో ఎక్కడా తేడా రావొద్దని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది.

2 లక్షలకుపైగా అవుట్​సోర్సింగ్ ఉద్యోగులు

రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా అవుట్​సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరికీ నెలల పాటు వేతనాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. వారు సైతం పదే పదే ప్రభుత్వం, ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ మంత్రులపై ఒత్తిడి తెస్తే కానీ వేతనాలు విడుదల కావడం లేదు. దీంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. దీనిని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి.. వేతనాల విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అధికారుల తీరుతో ప్రభుత్వంపైనా ప్రభావం పడుతుందని ఆయన సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.