ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల పొందే లబ్దిదారులకు ఈ-కేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో ఏ పథకం కావాలన్నా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందే.
అయితే ఇలా ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సర్వర్ సమస్యలతో అక్కడా జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మొబైల్ ఫోన్ తో సెల్ఫ్ ఈ-కేవైసీ ఎలా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
వాస్తవానికి ఆధార్ కార్డులో పేరు, పుట్టినతేదీ, అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసి ఉంటారు. కానీ ఆ వివరాలు ప్రభుత్వం యొక్క సచివాలయాల డేటా బేస్ లో మారవు. కానీ మీ ఆధార్ లో అప్డేట్, కరెక్షన్ చేసుకున్న వివరాలు ప్రభుత్వం యొక్క డేటా బేస్ లో కూడా మారితేనే మీకు సచివాలయం ద్వారా తీసుకునే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, అలాగే వివిధ సంక్షేమ పథకాలు అందుతాయి. కాబట్టి ఆధార్ లో మార్చుకున్న వివరాలు ప్రభుత్వ డేటా బేస్/ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అప్డేట్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలి.
వాస్తవానికి ఈ-కేవైసీ కోసం సచివాలయం లేదా ఈ-కేవైసీ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీ యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన లింక్ పనికొస్తుంది.
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc
ముందుగా ఈ లింక్ లో ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. అంటే ఈ-కేవైసీ పూర్తి అయినట్టే. ఈ-కేవైసీ పూర్తి అయిన 24 గంటల తర్వాత మీ ఆధార్ వివరాలు గ్రామవార్డు సచివాలయాల డేటా బేస్ లో అప్డేట్ అవుతాయి. ఆధార్ కలిగిన మీ కుటుంబ సభ్యుల అందరికీ ఈ లింక్ ద్వారా ఒకసారి ఈకేవైసీ పూర్తి చేసుకుని మీ ఆధార్ వివరాలను ప్రభుత్వ డేటా బేస్ లో అప్డేట్ అయ్యేలా చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


































