టీచర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్షించారు.


ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరిగా రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధివిధానాలు రూపొందించాలి. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. టీచర్లపై ఉన్న అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలి. వారు పూర్తిస్థాయిలో బోధనపై దృష్టిసారించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తల్లిదండ్రుల కమిటీలను భాగస్వామ్యం చేసే అంశాన్ని పరిశీలించాలి. మూసివేసిన పాఠశాలల వివరాలు సమర్పించాలి. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లలోకి పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలపై నివేదిక అందించాలి’ అని ఆదేశించారు. రాయలసీమలో కొత్తగా పాఠశాలలు ఎక్కడెక్కడ అవసరమన్న వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్, కార్యదర్శి కోన శశిధర్, సమగ్రశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు, వయోజన విద్య డైరెక్టర్‌ నిధి మీనా పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బారుకు బారులు తీరిన జనం

సమస్యలు వింటూ.. ధైర్యం చెబుతూ
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం వద్ద మంత్రి లోకేశ్‌ బుధవారం ఉదయం నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పింఛన్లు రాలేదని కొందరు, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు.. ఇలా అనేక మంది తమ సమస్యలను విన్నవించారు. వాటిని ఓపిగ్గా విన్న మంత్రి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. వారి నుంచి వినతిపత్రాలు తీసుకుని సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.