అమెజాన్‌కు షాక్.. ముగ్గురు డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్..

ఒక ఫోన్‌కు బదులు మరో ఫోన్ డెలివరీ చేసిన కేసులో ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బెంగళూరులోని ఇద్దరు, పాట్నాలోని ఒక డైరెక్టర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కర్నూలు జిల్లా కన్సూమర్ ఫోరం ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఇంతకీ సంగతేంటంటే.. కొన్నిరోజుల క్రితం వీరేష్ అనే కస్టమర్ అమెజాన్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేశాడు. డెలివరీ సమయంలో అతడికి ఊహించని షాక్ తగిలింది.


ఐఫోన్ 15 ప్లస్‌కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ అయింది. దీంతో అమెజాన్ కస్టమర్ కేర్‌కు బాధితుడు వీరేష్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పలు మార్లు ఫోన్ చేసి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. వీరేష్ తన వద్ద ఉన్న ఆధారాలతో కన్సూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఈ కేసుపై కొన్ని రోజుల క్రితం కన్సూమర్ ఫోరమ్ విచారణ జరిపింది. వెంటనే ఐఫోన్ డెలివరీ ఇవ్వాలని, లేని పక్షంలో రూ.80వేలు రీఫండ్‌తోపాటు రూ.25వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.

దీనిపైనా అమెజాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కన్సూమర్ ఫోరమ్ ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తీర్పు నిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావటం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం రచ్చ జరుగుతోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.