హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ దీనికి సమాధానం ఇచ్చారు. అది మరేదో కాదు.. 7 నుండి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవడం. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి యోగా చేయడం లేదా కిలోమీటర్ల కొద్దీ నడవడం కంటే శరీరానికి సరైన నిద్రను అందించడమే ఎక్కువ మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వ్యాయామం, మంచి ఆహారం ముఖ్యమే అయినప్పటికీ, నిద్ర సరిగ్గా లేకపోతే ఇవేవీ పూర్తి ఫలితాన్ని ఇవ్వవు.
ముంబైకి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ మఖీజా అభిప్రాయం: “కఠినమైన డైట్ లేదా వ్యాయామాలు మొదలుపెట్టే ముందు నిద్రను సరిచేసుకోవాలి. మెదడుకు తగిన విశ్రాంతి లభించినప్పుడే శరీరంలోని మిగిలిన భాగాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నిద్ర లేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది, ఇది మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బులకు దారితీస్తుంది.”
తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేవడం ప్రమాదకరమా? చాలామంది తెల్లవారుజామున 4 గంటలకే లేవడం గొప్ప ఆరోగ్యం అని భావిస్తారు. అయితే మీ శరీరానికి అవసరమైన 7-8 గంటల నిద్ర పూర్తి కాకుండానే, బలవంతంగా నిద్రలేవడం వల్ల ‘కోర్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఇది విపరీతమైన అలసట, ఏకాగ్రత లోపం మరియు ఆందోళనకు దారితీస్తుందని డాక్టర్ మఖీజా హెచ్చరించారు.
మంచి నిద్ర అంటే ఏమిటి? నిపుణుల ప్రకారం మంచి నిద్రలో మూడు అంశాలు ఉంటాయి:
- సమయం: కనీసం 7 నుండి 9 గంటలు.
- గాఢత: మెదడు తనను తాను మరమ్మత్తు చేసుకునే ‘డీప్ స్లీప్’ లభించాలి.
- క్రమశిక్షణ: సెలవు రోజుల్లో కూడా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.


































