ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు వారం రోజులే ఛాన్స్‌

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే ఈ పోస్టులన్నింటినీ డిప్యుటేషన్‌పై తీసుకోనున్నారు.

ఆసక్తి కలిగిన బోధన సిబ్బంది నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ప్రకటన విడుదల చేశారు. ప్రొఫెసర్ పోస్టులు 9, లెక్చరర్ పోస్టులు 20 ఉన్నాయి. వీటితోపాటు కోఆర్డినేటర్లు పోస్టులు ఐదు వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అక్టోబర్‌ 25వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అక్టోబర్‌ 28వ తేదీ నుంచి 30 వరకు పరిశీలిస్తారు. అనంతరం నవంబరు 4, 5వ తేదీల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ ఏడాది సెప్టెంబరు 28 నాటికి తప్పనిసరిగా 15 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నవారికి, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

అక్టోబర్‌18న యూజీసీ నెట్‌ ఫలితాలు.. అధికారిక ప్రకటన విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌) ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్‌ 18న యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఫలితాల వెల్లడి విషయాన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 21, 22, 23, 27, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో మొత్తం 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ పొందేందుకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు యూజీసీ నెట్‌ అర్హత ఉపయోగపడుతుంది.

కాగా జూన్ 18వ తేదీన మొత్తం 1,200 కేంద్రాలలో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించగా.. పరీక్ష జరిగిన 24 గంటల్లోపే పేపర్ లీక్‌ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. డార్క్‌ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమవడం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో నెట్‌ పరీక్షను యూజీసీ రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించింది. ఈ ఫలితాలు రేపు విడుదలకానున్నాయి.