ఇక ప్రతీ ఫోన్ లోనూ ఆ యాప్ ..! కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు

న దేశంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. దీంతో పాటే సైబర్ భద్రత కరవవుతోంది. కంపెనీలు కోట్లాది ఫోన్లు తయారు చేసి మార్కెట్లో అమ్మేసి చేతులు దులుపుకుంటుంటే, వినియోగదారులు మాత్రం సైబర్ నేరగాళ్ల బారిన పడి అందులో ఇన్ స్టాల్ చేసుకున్న యాప్ ల వల్లే తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు వాటిని తయారు చేసినప్పుడే కేంద్రం తయారు చేసిన యాప్ సంచార్ సాథీని తప్పనిసరిగా వాటిలో ప్రీలోడ్ చేసి ఇవ్వాలని కేంద్ర టెలికాం శాఖ తాజా నిబంధన విధించింది. సైబర్ నేరాల్ని ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం తయారు చేసిన సంచార్ సాథీ యాప్ ను కొత్తగా తయారు చేసే ప్రతీ ఫోన్ లోనూ ప్రీలోడ్ చేసి అమ్మాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 90 రోజుల్లోగా తమ ఆదేశాలు అమలు చేయాలని కంపెనీలకు సూచించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఇప్పుడు వాటి ద్వారానే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో సులువుగా ఇన్ స్టాల్ చేసుకుని సైబర్ నేరాలకు సంబంధించిన మెసేజ్ లు, లింక్ లు, కాల్స్ రాకుండా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తోంది. ఇప్పటికే సాధారణ పౌరులతో పాటు వీఐపీలు, ప్రజాప్రతినిధులు సైతం సైబర్ నేరాల బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం స్వయంగా సంచార్ సాథీ యాప్ తయారు చేయించింది. అయితే ఈ యాప్ ను ప్రీలోడ్ చేసి ఫోన్లు అమ్మే విషయంలో ఇతర కంపెనీలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా అమెరికాకు చెందిన ఆపిల్ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ యాప్ లు మినహా థర్డ్ పార్టీ యాప్ లను ఆపిల్ సాధారణంగా అనుమతించదు. కానీ భారత్ లో ఇప్పుడు కేంద్రమే ఈ యాప్ ను తయారు చేయించి ఇస్తుండటం వల్ల ఆపిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం సూచనపై యాపిల్, శాంసంగ్, జియోమీ ఇప్పటివరకూ స్పందించలేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.