NPS rules: NPSలో కీలక మార్పులు.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

NPS withdraw: జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు పలువురు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనం నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS). దీనికి సంబంధించిన నిబంధనల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ PFRDA కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని 60 ఏళ్ల తర్వాత పెన్షన్ రూపంలో తిరిగి తీసుకునేందుకు ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఈ నిబంధనను సవరిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సర్క్యులర్ రిలీజ్ చేసింది. వివిధ సందర్భాల్లో NPS కింద పెన్షన్‌ ను పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు ఓకే చెప్పింది.
ఫిబ్రవరి 1, 2024 నుండి NPS చందాదారులు తమ ఖాతా నుంచి పెన్షన్ పాక్షిక ఉపసంహరణకు పెన్షన్ ఫండ్ అనుమతిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం, యజమానుల కంట్రిబ్యూషన్ మినహాయించి, సబ్‌స్రైబర్స్ తమ పెన్షన్‌లో 25 శాతాన్ని ఉపసంహరించుకోగలుగుతారని PFRDA పేర్కొంది.
ఈ విధంగా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న వారితో సహా పిల్లల ఉన్నత విద్య, వివాహం, సబ్‌స్క్రైబర్ పేరిట నివాస గృహం లేదా ఫ్లాట్‌ కొనుగోలు, కొన్ని వ్యాధులకు సంబంధించిన వైద్య ఖర్చులు, వైకల్యాల సమయంలో మాత్రమే ఇలా చేయడం కుదురుతుందని స్పష్టం చేసింది.


NPS ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణకు చందాదారులు సంబంధిత ప్రభుత్వ నోడల్ కార్యాలయం లేదా పాయింట్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA)కి కారణాలతో సహా సెల్ఫ్ డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు. పేరును సరిపోల్చుకోవడానికి చందాదారుల బ్యాంక్ ఖాతాతో CRA ‘పెన్నీ డ్రాప్’ పరీక్షను నిర్వహిస్తుంది. తర్వాత మాత్రమే సబ్‌స్క్రైబర్ కోరిన మొత్తం వారి ఖాతాకు బదిలీ చేయబడుతుంది.