NTR Bharosa Pension scheme : పింఛను పథకం పేరు ‘ఎన్టీఆర్‌ భరోసా’గా మార్పు – పింఛనుదారులపై వరాల జల్లు

www.mannamweb.com


అమరావతి: పింఛనుదారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పేద వర్గాల మోములో చిరునవ్వులు పూయించేలా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతల స్వీకరణ అనంతరం మూడో సంతకం పింఛన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జులై 1న పింఛను కింద వీరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి) అందిస్తారు.

దివ్యాంగులకు ఎన్నడూ లేని భరోసా
దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న రూ.3 వేలను ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందే రూ.5 వేల పింఛను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్ఠు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేలు పింఛను ఇవ్వనున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జులై 1న అందించనున్నారు.

ఏడాదికి రూ.33 వేల కోట్లు
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛనుదార్లకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు రూ.1,939 కోట్లు ఖర్చవుతోంది. పెంచిన పింఛను అమలుకుగాను జులై నెలకు రూ.4,408 కోట్లు (ఏప్రిల్‌ నుంచి ఇచ్చే ఎరియర్స్‌ మొత్తం రూ.1,650 కోట్లు కలిపి) ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు రూ.2,758 కోట్లు అవసరమవుతుంది. మొత్తంగా ఏడాదికి రూ.33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.