దేశం మొత్తం ఎదురు చూస్తున్న క్షణం చివరకు వచ్చేసింది.. ఓలా రోడ్‌స్టర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి.

కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఓలా నుంచి వచ్చిన రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి అడుగుపెట్టింది.


ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మరి ఈ బైక్ ధరలు, ఫీచర్లు, డెలివరీలకు సంబంధించిన తాజా వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సంస్థ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) అనే మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు విక్రయానికి వచ్చింది. ఇంతవరకు ఓలా కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించగా, ఇకపై ఎలక్ట్రిక్ బైక్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ధరలు ప్రకటించిన తర్వాత ఇటీవలనే మార్కెట్‌లో దీనిని ప్రవేశపెట్టారు. మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన ఆఫర్‌లు ప్రకటించడంతో చాలా మంది పోటీపడి బుకింగ్‌లు ప్రారంభించారు.

దీంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట ఏప్రిల్ నెలలోనే రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయ్యాయి. కానీ, మే నెల వచ్చినా ఈ బైక్ డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మే 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఓలా సంస్థ వీడియోతో పాటు సోషల్ మీడియాలో ప్రకటించింది. అందువల్ల, మే 23వ తేదీ నుంచి రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మొదలయ్యాయి. బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు ఇవ్వడానికి రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇప్పటికే షోరూమ్‌లకు చేరుకోవడం ప్రారంభించాయి.

దీనిని ధృవీకరించే విధంగా ఆన్‌లైన్‌లో విడుదలైన ఒక వీడియోలో ట్రక్కులో షోరూమ్‌కు తీసుకువచ్చిన రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లను కొంతమంది యువకులు దించి షోరూమ్ లోపలికి నడుపుతూ తీసుకెళ్లడం చూడవచ్చు. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న ఓలా కర్మాగారం నుంచి రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని షోరూమ్‌లకు తరలించబడుతున్నాయి.

షోరూమ్‌లకు బైక్‌లు చేరుకోవడంతో మే 23వ తేదీ నుంచే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను కస్టమర్‌లకు డెలివరీ చేయడం మొదలుపెట్టి ఉంటారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకున్న మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన అదనపు వారంటీ, మూవ్ ఓఎస్+ (Move OS+), ముఖ్యమైన బైక్ మెయింటెనెన్స్ లభిస్తాయి. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పటికే మొదటి 5,000 బుకింగ్‌లను దాటిపోయింది.

గత ఫిబ్రవరి నెలలో విడుదలైన ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2.5 kWh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.99,999గా ఉంది. 3.5 kWh బ్యాటరీతో రూ.1,09,999గా ఉంది. 4.5 kWh బ్యాటరీతో రూ.1,24,999గా నిర్ణయించబడింది.

రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌తో పాటు, రోడ్‌స్టర్ ఎక్స్+ (Roadster X+) ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్‌లో విడుదలైంది. 4.5 kWh బ్యాటరీ, 9.1 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభించే రోడ్‌స్టర్ ఎక్స్+ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధరలు ప్రస్తుతం రూ.1,29,999 (4.5 kWh), రూ.1,99,999 (9.1 kWh)గా ఉన్నాయి. బ్యాటరీని బట్టి బైక్ రేంజ్ మారుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: హీరో స్ప్లెండర్ (Hero Splendor) బైక్‌కు పోటీగా, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ భారతదేశ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో పెద్ద ప్రభావాన్ని చూపగలదని భావిస్తున్నారు. ఈ బైక్ డెలివరీలు ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను రోడ్లపైన చూడవచ్చు. భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నుంచి ఇలాంటి మరిన్ని ఎలక్ట్రిక్ బైక్‌లను ఆశించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.