పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ‘పాత ప్రేమలు’ చిగురిస్తున్నాయి.. ఎఫైర్లకు దారితీస్తున్నాయి

స్నేహం( friendship).. సృష్టిలోనే అనిర్విచనీయమైన బంధం అది. కుటుంబ సభ్యులు కంటే స్నేహితుల మధ్యనే ఎక్కువ ఆప్యాయత, అనుబంధం ఉంటుంది.


మనసులో ఉన్న బాధతో పాటు ఆనందాన్ని స్వచ్ఛంగా, స్వతంత్రంగా పంచుకోగలిగింది ఒక్క స్నేహితుడి వద్దే. అది ఎంతటి రహస్యమైనా, ప్రమాదమైనా, చివరకు చెప్పుకోలేనిదైనా స్నేహితుల వద్ద ఇట్టే పంచుకోగలం. పాఠశాలలు, కళాశాలల్లో తరగతి గదుల్లోనే ‘స్నేహం’ చిగురుస్తుంది. ప్రాథమిక స్థాయి అదే కావడంతో స్నేహానికి పునాది పడుతుంది. జీవితంలో.. జీవిత గమనంలో వయసుకు వచ్చాక చాలామంది స్నేహితులు ఎదురవుతారు. కానీ ప్రాథమిక స్థాయిలో ఏర్పడే పాఠశాల స్నేహం ఆచంద్రార్కంగా నిలుస్తుంది. జీవితంలో మరువలేనివి ఆ స్నేహాలు. చివరకు ప్రాణం పోయే ముందు కూడా ఆ స్నేహాలను ఎంతోమంది గుర్తుకు తెచ్చుకుంటారు. అయితే అటువంటి స్నేహాల్లో ‘మలినం’ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఓ మిత్రుడి ఆవేదన నేపథ్యంలో ఈ కథనం..

మనసు స్థాయి దాటని ప్రేమలు..
సాధారణంగా ప్రాథమిక స్థాయిలో( primary stage) స్నేహాలు కాస్త ముదిరి ‘ప్రేమకు’ దగ్గరవుతుంటాయి. కానీ వయస్సు రీత్యా అది మనసు స్థాయి దాటదు. ప్రేమను వ్యక్తపరిచే పరిస్థితి ఉండదు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచి జీవిత గమనంలోకి మారే క్రమంలో.. చాలామందిలో ‘ప్రేమ’ సజీవంగానే ఉండిపోతుంది. ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితం, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు, మంచి చెడ్డలు.. ఇలా జీవితంలో ముఖ్య భాగమవుతాయి. ఆ సమయంలో బాల్యం నాటి గురుతులు నెమరు వేసుకోవడం తప్ప.. సగటు మనిషి చేసింది ఏమీ ఉండదు.

పెరుగుతున్న ఆత్మీయ కలయికలు..
ఇటీవల పూర్వ విద్యార్థుల( old students ) ఆత్మీయ కలయికలు పెరుగుతున్నాయి. రెండు మూడు దశాబ్దాల కిందట చదువుకున్న వారంతా ఒక వేదిక పైకి వస్తున్నారు. తమలో ఉన్న స్నేహబంధాలను గుర్తుచేసుకొని ఆత్మీయ కలయికల సమయంలో నెమరు వేసుకుంటున్నారు. అయితే ప్రతి విషయంలోనూ మంచి, చెడ్డ ఉంటుంది. అలాగే ఈ ఆత్మీయ కలయికల్లో పాత ప్రేమలు తెరపైకి వస్తున్నాయి. నాలుగు పదుల వయసులో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి దాపురిస్తోంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికల్లో మనసు విప్పి మాట్లాడుకున్న వారు ఉంటారు. కుటుంబ పరిస్థితులు చెప్పుకునే వారు ఉంటారు. ‘నా బ్రతుకు ఇలా అయ్యింది’ అని నిస్పృహలు వ్యక్తం చేసేవారు ఉంటారు. ఈ క్రమంలో పాత ప్రేమలు ముదురుతున్నాయి. కుటుంబ కలహాలకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో పూర్వ విద్యార్థుల పేరిట కలుస్తున్న వారిలో పాత ప్రేమికులు, అప్పట్లో ప్రేమను వ్యక్తం చేయలేని వారు.. ఇప్పుడు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.

అయితే ఇలా బాధితులుగా మారుతున్న చాలామంది సోషల్ మీడియా వేదికగా.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక పేరుతో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే స్నేహం అనేది సృష్టిలో అతి పవిత్రమైనది. దానిని అపవిత్రం చేయకూడదు అన్నదే అభిప్రాయం. అలాగని పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, స్నేహితుల అపూర్వ సమ్మేళనం వంటివి వద్దు అనేది అభిప్రాయం కాదు. కేవలం అవి మన స్నేహాన్ని, మనలో ఉన్న స్నేహ భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి, మన కష్టాలను పాలు పంచుకునేందుకు, మన జన్మనిచ్చిన గ్రామాన్ని, మనం చదువు నేర్చుకున్న పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలన్న ప్రణాళికతో జరగాలే కానీ… మన జీవితాలను వివాదాల్లో నెట్టే పరిస్థితి ఉండకూడదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.