పెళ్లిచూపులకు ఒకరు.. పెళ్లికి మరొకరు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా గ్రామంలో పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకొని వరుడి కోసం ఎదురుచూస్తున్న వధువు కుటుంబానికి అనూహ్యమైన షాక్‌ తగిలింది. హరియాణాలోని పానీపత్‌ నుంచి వస్తాడని ఎదురుచూసిన వరుడి స్థానంలో మరో వ్యక్తి రావడం చూసి అందరూ అవాక్కయ్యారు. మధ్యవర్తిగా ఉన్న మహిళ వధువు తల్లిదండ్రులకు ఒక యువకుడి ఫొటోను చూపించి పెళ్లిసంబంధాన్ని కుదిర్చి, పెళ్లికి మరో యువకుడిని పంపింది. మొదట చూపిన యువకుడికి వేరొకరితో పెళ్లిసంబంధం కుదిర్చినట్లు తెలిసింది. దీనిపై మధ్యవర్తిని నిలదీసిన వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికొడుకు బదులుగా వచ్చిన పవన్‌కుమార్‌ను, అతడి బంధువులను, మధ్యవర్తిని మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మ్యారేజ్‌ బ్రోకర్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని, బహుశా ఈ వ్యవహారం కూడా అలాంటిదే అయి ఉండవచ్చని పోలీసు అధికారి రాజీవ్‌సింగ్‌ తెలిపారు. పెళ్లిసంబంధం కుదిర్చినట్టే కుదిర్చి.. డబ్బు, బంగారంతో ఉడాయించడమే ఈ తరహా బ్రోకర్ల పని అన్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.