ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు డ్రగ్స్, గంజాయి మాఫియాల బెండుతీస్తున్నారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా బట్వాడా మూలాల లింకులు ఏవోబీలో కదులుతున్నాయి. ఈక్రమంలో గంజాయిగాళ్ల ఆగడాలపై ఉక్కుపాదంమోపాలని ఏపీ సీఎం చంద్రబాబు, హోమ్ మినిస్టర్ అనిత ఆదేశించారు.. దీంతో పోలీసులు మరింత అలెర్టయ్యారు. తనిఖీలను ముమ్మరం చేసి భారీగా గంజాయిని సీజ్ చేశారు. కేసుల గ్రాఫ్ కూడా ఆమాంతం పెరిగింది. యువతను టార్గెట్ చేసుకొని దందా చేస్తోన్నమత్తు మాఫియాపై తాజాగా ఏపీ యాంటీ నార్కోటిక్ టీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా విజయవాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను విస్తృతం చేశారు. గంజాయి, డ్రగ్స్ నెట్ వర్క్‌కు చెక్ పెట్టేలా డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. మత్తు జాడలు కన్పిస్తే మక్కలిరగొట్టి మడతేసుడే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేశారు.
పోలీసుల వరుసదాడులతో భారీగా సరుకు దొరకడం ..కేసుల సంఖ్య పెరగడం మాత్రమే కాదు విస్తుపోయే నిజాలు తెరపైకి వచ్చాయి. కొందరు కేటుగాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకొని కొరియర్ సర్వీస్‌లో గంజాయిని బట్వాటా చేస్తున్నట్టు తేలింది. గంజాయి స్మగ్లర్లు రూటు మారుతున్నట్లు గుర్తించారు. గంజాయి స్మగ్లింగ్ చేయడానికి కొత్త దారులను వెతుకుతున్నట్లు తేలింది. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. కొరియర్ సర్వీసుల ద్వారా కూడా గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పక్కా సమచారంతో ఇటీవలే మైలవరం పోలీసులు సదరు కేటుగాళ్లకు చెక్ పెట్టారు. వారి నుంచి లిక్విట్ గంజాయిని సీజ్ చేశారు. అంతేకాదు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఆల్ఫ్రోజోలం వంటి ట్యాబ్లట్లను విక్రయిస్తోన్న మెడికల్ మాఫియాకు కూ డా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మొత్తానికి ఏపీ వ్యాప్తంగా గంజాయి సహా డ్రగ్ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. నార్కోటిక్ టీమ్స్ పక్కా యాక్షన్ ప్లాన్‌తో మత్తుబ్యాచ్‌లపై కదలికలపై కన్నేశారు. గీత దాటితే తాట తీసేలా డాగ్‌స్వ్కాడ్‌తో తనిఖీలను మరింత విస్తృతం చేస్తున్నారు.