రాత్రి వేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనే ప్రపంచంలోని పలు నగరాలకు సంబంధించిన చిత్రాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిలో టోక్యో, సింగపుర్ వంటి ప్రముఖ నగరాలతో సమానంగా భారత రాజధాని దిల్లీ కాంతులీనుతున్న (Delhi glows as brightly as Tokyo, Singapore) దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాత్రి 10.54 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు ఐఎస్‌ఎస్ వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన పట్టణాలలో దిల్లీ, సింగపూర్, టోక్యో, సావోపాలో వంటి నగరాలు ఉన్నట్లు పేర్కొంది.
ఐఎస్‌ఎస్ షేర్ చేసిన చిత్రాల్లో దిల్లీ విద్యుత్ కాంతులతో వెలుగులీనుతుండగా.. ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటైన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చిత్రంలోని కుడివైపున దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తోంది.
































