ఏపీలో కూటమి సర్కార్ తాజాగా పీ4 పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించబోతున్నాంటూ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఈ పథకం అమలుకు ఇప్పుడు ఎక్కడిక్కడ టార్గెట్లు ఇచ్చేస్తున్నారు.
దీంతో అధికారులు దీని అమలు కోసం పరుగులు తీస్తున్నారు. ఇందులో భాగమైన అందరితో పరుగులు తీయిస్తున్నారు. ఇదే క్రమంలో పీ4 పథకంలో భాగస్వాములు కావాలంటూ టీచర్లు, సచివాలయ సిబ్బందికి సైతం టార్గెట్లు పెట్టడంతో వారు గగ్గోలు పెడుతున్నారు.
రాష్ట్రంలో పేద కుటుంబాలకు (బంగారు కుటుంబాలు) కనీస వసతులు కల్పించేందుకు ముందుకొచ్చే వారి కోసం ప్రభుత్వం తీవ్రంగా గాలిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నత వర్గాల వారిని సంప్రదించి ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. దీనికి వారి నుంచి మంచి స్పందనే వస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్రమంతా పేదల్ని వెతికి వెతికి మరీ వారిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేస్తున్న ఈ భారీ ప్రయత్నంలో అల్పాదాయ వర్గాల్ని భాగస్వాములు కావాలని కోరుతుండటం, అందుకు టార్గెట్లు పెట్టడం కొత్త సమస్యలు సృష్టిస్తోంది.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, టీచర్లు, ఇతర ఉద్యోగుల్ని పీ4 పథకంలో భాగస్వాములు కావాలని అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు అల్పాదాయం కలిగిన తాము ఇంకొకరిని ఆదుకునే పరిస్ధితుల్లో లేమంటూ చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా నెలకు 30 వేలకు కాస్త అటు ఇటుగా జీతం పొందుతున్న సచివాలయ సిబ్బంది, అంతకంటే తక్కువ వేతనాలు తీసుకుంటున్న టీచర్లను సైతం పీ4లో భాగస్వాములై పేద కుటుంబాల్ని దత్తత తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండటం వారికి సంకటంగా మారింది.
ఇప్పటికే చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న అల్పాదాయ ఉద్యోగులు బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునే విషయంలో ముందుకు రాలేని పరిస్ధితి ఉంది. అలాగని ఉన్నతాధికారుల ఆదేశాల్ని ధిక్కరిస్తే ఉద్యోగాలకే ముప్పు వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతల్ని వారు ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సకాలంలో డీఏలు, పీఆర్సీ, ఐఆర్ సహా ఏ ప్రయోజనాలు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో టీచర్లు, సచివాలయ సిబ్బందిని ఇలా బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకోవాల్సిందేనని టార్గెట్ పెట్టడం సరికాదనే వాదనను ఉద్యోగ సంఘాలు వినిపిస్తున్నాయి.
































