క్రికెట్ అభిమానులకు అసలు సిసలు క్రికెట్ మజాను అందిస్తూ.. భారత్-పాక్ మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. పరుగులు చేయడానికి బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న పిచ్‌పై.. రెండు దేశాల బౌలర్ల మధ్య ఓ యుద్ధమే జరిగింది. అంతిమంగా టీమిండియా సూపర్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. కేవలం 119 పరుగుల స్కోర్‌ను కాపాడుకుంటూ.. భారత బౌలర్లు అద్వితీయమైన విజయాన్ని అందించారు. అయితే.. భారత్‌పై ఓటమిని జీర్ణించుకోలేకపోయిన పాక్ స్టార్ బౌలర్ నసీమ్ షా గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను ఏడుస్తుంటే.. మరో బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్‌ను ఓదార్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
120 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. కానీ, చివర్లో నసీమ్ షా.. పాక్ విజయం కోసం పోరాటం చేశాడు. కేవలం 4 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి.. టీమిండియాను కాస్త కంగారు పెట్టారు. పాక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 11 పరుగులు సాధించింది అంటే.. అది నసీమ్ షా వల్లే. అయినా కూడా విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది పాకిస్థాన్. బౌలింగ్‌లో 4 ఓవర్లలో వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన నసీమ్ షా.. ఈ మ్యాచ్ గెలుస్తామని చాలా నమ్మకం పెట్టుకుని ఉంటాడు.
కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్‌ను తన తొలి ఓవర్‌లోనే అవుట్ చేసి పాక్‌కు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. బ్యాటింగ్‌లో కూడా తన శక్తికి మించి పోరాటం చేశాడు. అయినా కూడా ఓటమి విక్కిరించడంతో తన బాధను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మ్యాచ్ ముగించుకుని పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో నసీమ్ షా ఏడ్చేశాడు. అతనితో పాటు నాటౌట్‌గా నిలిచిన షాహీన్ అఫ్రిదీ.. వెంటనే నసీమ్ షాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరి టీమిండియాపై ఓటమిని తట్టుకోలేక.. నసీమ్ షా కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.