Palla Srinivasarao: తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasarao) నియమితులయ్యారు.


అమరావతి: తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasarao) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.

‘‘విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబర్చిన సీనియర్‌నేత, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారు’’ అని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

మరోసారి ఉత్తరాంధ్ర నేతనే వరించిన అధ్యక్ష పదవి..
ఏపీ పునర్విభజన తర్వాత తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా.. ఇది మూడోసారి కావడం విశేషం. తొలుత కళా వెంకట్రావుకు అప్పగించగా.. గత ఐదేళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించారు. గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో పల్లా అనేక ఇబ్బందులకు గురయ్యారు. వైకాపా రాగానే ఆ పార్టీ నేతలు పల్లాను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు.

ఒకానొక దశలో ఏయూలో పనిచేస్తున్న ఆయన సతీమణితో ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. విజయసాయిరెడ్డితో అన్నివైపుల నుంచీ పొగపెట్టారు. అయినా పల్లా పార్టీని వీడలేదు. వైకాపాలోకి వెళ్తే తనకు రాజకీయ సమాధేనని, వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. దీన్ని సహించలేని విజయసాయి గాజువాక ప్రధాన సెంటర్‌లో ఉన్న పల్లా ఆస్తిపై కన్నేశారు. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని జీవీఎంసీని ఆదేశించారు. రాత్రికిరాత్రే అందరినీ గృహనిర్బంధాలు చేసి భవనంలోని కొంత భాగాన్ని కొట్టించేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై పలు కేసులు మోపారు. విశాఖ ఉక్కుపై పల్లా ఆమరణ దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి శిబిరాన్ని కూల్చేసి ఈడ్చుకుపోయారు. అయినా ఎక్కడా తలొగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటి వరుసలో ఉండి పోరాటాలకు నాయకత్వం వహించారు. మంత్రి పదవి వస్తుందని అనుయాయులంతా ఆశగా ఎదురుచూడగా.. ఎప్పుడు ఏది ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసు అని చెబుతూ వచ్చారు. ఇప్పడు పల్లాకు అధ్యక్ష పదవి ఖరారు చేయడంతో సరైన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.