పాన్ కార్డు (Pan Card) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో (Aadhaar) అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది.
రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానం పూర్తి చేయాలి. ఆధార్‌తో జత చేయని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి పాన్ చెల్లుబాటు కాదు. చెల్లుబాటులో లేని పాన్‌తో నిబంధనల మేరకు లావాదేవీలు చేయడం వీలు పడదు. ఒకవేళ మీరు ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేశారో లేదో గుర్తు లేదా? ఒకవేళ చేయకుంటే ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలివీ..
అనుసంధానం అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఆధార్‌తో పాన్ అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ ఎప్పటి నుంచో చెబుతోంది. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసిందీ లేనిదీ గుర్తు లేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో ‘లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే ఆ సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్ చెల్లించి ఆధార్-పాన్ అనుసంధానం పూర్తి చేయాలి.
ఫైన్ ఎలా చెల్లించాలి..?
ఫైన్ చెల్లించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్, రెండోది ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్. తొలుత ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఫైన్ చెల్లించే విధానం తెలుసుకుందాం.
I.తొలి విధానం
ముందు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ కావాలి. అందులో ‘ఈ-పే ట్యాక్స్’పై క్లిక్ చేయాలి.
అక్కడ పాన్ నంబర్‌ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాతి పేజీలో మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
వెరిఫికేషన్ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి. (ఒకవేళ మీ దగ్గర సంబంధిత బ్యాంకింగ్ ఆప్షన్స్ లేకపోతే రెండో పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.)
తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్ ఇయర్ (Ay 2023-24)ను ఎంచుకకోవాలి. తర్వాత అదర్ రిసిప్ట్స్ (Other receipts (500) ఎంచుకోవాలి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.
పేమెంట్ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని లింక్ ఆధార్‌ను క్లిక్ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
II.రెండో విధానం
రెండో విధానంలో ఫైన్ చెల్లించేందుకు egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
తొలుత నాన్- టీడీఎస్/టీసీఎస్ చెల్లింపుల విభాగంలోకి వెళ్లాలి.
అక్కడ Tax applicable – (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాత పాన్, మదింపు సంవత్సరం (AY 2023-24), పేమెంట్ విధానం, అడ్రస్, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ తదితర వివరాలు ఇవ్వాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో పాన్ ఆధార్‌ను పూర్తి చేయాలి.
పూర్తి చేయకుంటే ఇబ్బందే!
చెల్లుబాటులో లేని పాన్‌తో బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల్లాంటివి తెరవలేరు.
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి.
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు.
డీమ్యాట్ ఖాతా ఉన్నా షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు.
మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) విధించాల్సిన చోట అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది.
సెక్యూరిటీస్ మార్కెట్లోని అన్ని లావాదేవీలకు పాన్ కీలక గుర్తింపు. కాబట్టి, తప్పనిసరిగా ఇది చెల్లుబాటులో ఉండాల్సిందే.
పాన్-ఆధార్ అనుసంధానం లేకపోతే కేవైసీ నిబంధనలు పాటించనట్లుగా భావించి పెట్టుబడి లావాదేవీలపై పరిమితులు ఉండొచ్చని సెబీ ఇప్పటికే తెలిపింది. ఈ రెండూ జత చేస్తేనే సాఫీగా పెట్టుబడి లావాదేవీలు సాగుతాయని స్పష్టం చేసింది.