PAN Card | పాన్‌ కార్డ్‌ 2.0 షురూ.. మరి పాత కార్డ్‌ పరిస్థితేంటి?

ఫీచర్లు, భద్రతా ప్రయోజనాలు తెలుసా?
PAN Card | ఒకప్పటితో పోల్చితే దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యమైనది పాన్‌ (పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌) కార్డ్‌.


ఈ కార్డ్‌ లేకపోతే చాలా కష్టాలే వచ్చిపడుతాయి. ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ల దగ్గర్నుంచి, బ్యాంకుల్లో ఖాతాలను తెరవడందాకా పాన్‌ కార్డ్‌ ఎంతో అవసరం మరి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పాన్‌ కార్డ్‌ 2.0 ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది.

ఇదీ సంగతి..
పాన్‌ కార్డ్‌ 2.0 అనేది ఓ సెక్యూర్‌ డాక్యుమెంట్‌. ఏటీఎం కార్డు తరహాలోనే దీని పరిమాణం ఉంటుంది. భవిష్యత్తులో మీరు పాన్‌ కార్డ్‌ పొందినట్టయితే ప్రాజెక్ట్‌ 2.0 కింద మాత్రమే జారీ చేయబడుతాయి. ఇక పాన్‌ కార్డ్‌ 2.0లో ఓ ప్రత్యేక రకానికి చెందిన క్యూఆర్‌ కోడ్‌, చిప్‌ ఉంటుంది. ఎన్నెన్నో ప్రత్యేక ఫీచర్లు వీటి సొంతం. సైబర్‌ మోసాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో ఖాతాదారులు, కార్డుదారులు వాటి బారినపడకుండా రక్షించడంలో ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం ఈ కార్డుల జారీకి ఎలాంటి చార్జీలను వసూలు చేయబోదు.

పాన్‌ కార్డ్‌ పొందడం ఎలా?
ఇందు కోసం తొలుత ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అప్పుడు తెరుచుకొనే వెబ్‌పేజ్‌పై మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ తదితర కావాల్సిన సమాచారం అంతటిని ఎంటర్‌ చేయాలి. అప్లికేబుల్‌ టిక్‌ బాక్స్‌ను ఎంచుకొని, స్వేచ్ఛగా సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై ఓ కొత్త పేజీ తెరుచుకుంటుంది. అక్కడ ఆదాయ పన్ను శాఖతో మీ ప్రస్తుత వివరాలను పరిశీలించుకోవాలి. అనంతరం మీ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌కు వన్‌-టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి వెరిఫై చేసుకోవాలి. అయితే ఈ ఓటీపీ 10 నిమిషాలు మాత్రమే పనిచేయగలదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ సమయం దాటితే మరో ఓటీపీ అవసరం ఉంటుంది. ఇక అప్పుడు పేమెంట్‌ పద్ధతిని ఎంచుకొని చెల్లింపులు జరపాలి. షరతులను అంగీకరిస్తున్నట్టు టిక్‌ బాక్స్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మరొక్కసారి పేమెంట్‌ మొత్తాన్ని సరిచూసుకొని, నిర్ధారించుకోవాలి. ఆపై కంటిన్యూపై క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ ఈ-మెయిల్‌ ఐడీకి పాన్‌ కార్డ్‌ రాగలదు.

పాత కార్డ్‌ పరిస్థితేంటి?
పాన్‌ కార్డ్‌ 2.0 రాబోతున్న నేపథ్యంలో అనేకానేక ప్రశ్నలు మిమ్మల్ని తొలిచేస్తు ఉండవచ్చు. అందులో కొత్త కార్డులు వస్తే.. ఇప్పుడున్న పాన్‌ కార్డులు నిరుపయోగంగా మారిపోతాయా? అన్నదీ ఉండనే ఉంటుంది. అయితే పాన్‌ కార్డ్‌ 2.0 వచ్చాక కూడా పాత పాన్‌ కార్డులు ఎప్పట్లాగే పనిచేస్తాయి. పాత పాన్‌ కార్డులతో మీ పనేమీ ఆగిపోదు. అలాగే మీ పాన్‌ కార్డులో ఏవైనా తప్పులు దొర్లినా వాటిని సరిచేసుకోవచ్చు. సైబర్‌ దాడులు, ఆర్థిక మోసాలను అరికట్టేందుకే ఈ పాన్‌ కార్డ్‌ 2.0 ప్రాజెక్టును కేంద్రం మొదలు పెట్టిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొత్త పాన్‌ కార్డులతో ఆర్థికపరమైన పనులు మరింత సులువు కానున్నాయని అంటున్నారు.