Pandemic: కరోనా తరహా మరో సంక్షోభం ప్రపంచ దేశాలు ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రపంచ దేశాలు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా సంక్షోభ నివారణ ఏర్పాట్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అందులో భాగంగానే పలు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఉండాలని అన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు తగిన వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, చికిత్సలు, టీకాలు అన్నీ అందుబాటులో ఉంటే.. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించే అవసరం ఉండదన్నారు.
2021లో తాను చేసిన సూచనలన్నీ 2023 నాటికే ప్రపంచ దేశాలు మరిచిపోయాయన్నారు. కానీ ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైనిక అవసరాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో..సంక్షోభం విషయంలో అంతే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే సంక్షోభ నివారణలపై దృష్టి పెట్టాలని తెలిపారు. సంక్షోభం సమయంలో వివిధ దేశాలు కలిసికట్టుగా పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ పంజా విసురుతోంది. అయితే ఇటీవల సింగపూర్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోని పాట్రిక్ వాలెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.