రాష్ట్రంలో మూడు పార్టీల కలయికతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మూడో నెల పాలన కొనసాగిస్తుండగా నామినేటెడ్ పదవుల పందేరంపై పెద్ద చర్చనే నడుస్తోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పదవుల కోసం పోటీ పడుతున్న నేతలకు అధికారం చేతికెప్పుడన్న ఆశ అదృష్టానికి పరీక్ష గా మారింది. ఏపీ క్యాబినెట్ లో సీఎం మినహా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చోటు దక్కకపోవడంతో అధికారం కోసం ఆశపడే వారి జాబితా చాంతాడంతనే ఉంది.
టిడిపి, బిజెపి, జనసేనలోనే ముఖ్య నేతలతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు నామినేటెడ్ పదవులకు పోటీ పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మిరహా అన్ని స్థానాల్లోనూ సైకిల్ స్పీడ్ కు బ్రేకులు పడకపోవడంతో మెజారిటీ సీట్లు టిడిపికి దక్కాయి. దీంతో కచ్చితంగా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు కేబినెట్ లో జిల్లాకు ఖచ్చితంగా చాన్స్ ఉంటుందని అందరూ భావించినా అంచనాలు కాస్త తలకిందులయ్యాయి. పలమనేరు నుంచి ఎంఎల్ఏ గా గెలిచిన అమర్నాథ్ రెడ్డి సీనియర్ గా తనకు తప్పక క్యాబినెట్ చాన్స్ ఉంటుందని భావించారు.
ఇక పీలేరు నుంచి గెలిచిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని ఊహించారు. అయితే అన్యూహంగా ఇద్దరి పేర్లు చంద్రబాబు క్యాబినెట్ లో లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరూ నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా యాక్టివ్ గా లేని ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు నామినేటెడ్ పదవులైనా దక్కుతాయా… అన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ ర్యాంక్ పదవి వస్తుందన్న ఆశ కూడా క్యాడర్ లో ఉంది. అయితే ఆ ఇద్దరూ పదవులు, అధికారం పై మాత్రం నోరు మెదపక పోగా జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు మాత్రం నామినేటెడ్ పదవుల కోసం ఆత్రుతగా ఉన్నారు.
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషతోపాటు ఎస్సీ కోటా లో ఛాన్స్ దక్కుతుందని ఎమ్మెల్యేలు మురళీమోహన్, థామస్, కోనేటి ఆదిమూలం లు గంపెడ ఆశతో ఉన్నారు. మరోవైపు కూటమి పొత్తులో భాగంగా తిరుపతి సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తో పాటు మరి కొంతమంది టిడిపి సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. టీటీడీ బోర్డు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కుప్పం డెవలప్మెంట్ అథారిటీ, రేస్కో చైర్మన్ ఇలా పదవుల్లో ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్న నేతలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.
మరోవైపు బిజెపి, జనసేన నుంచి కూడా నామినేటెడ్ పదవుల కోసం తీవ్ర పోటీనే ఉంది. తిరుపతి జనసేన అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానిక ఎమ్మెల్యేగా టిటిడి బోర్డులో సభ్యత్వాన్ని ఆశిస్తుండగా, తుడా చైర్మన్ పదవి కోసం టిడిపిలో తీవ్ర పోటీనే నెలకొంది. తుడా చైర్మన్ గా నియమిస్తే టీటీడీలో ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా సభ్యత్వం దక్కుతుందని ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇక టిటిడి బోర్డులనూ ఛాన్స్ దక్కుతుందని భావించే వారిలో టిడిపి బిజెపి జనసేన నేతలు ఉన్నారు. టిడిపి నుంచి మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, జనసేన నుంచి తిరుపతి పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేతిలో పుంగనూరులో ఓడిపోయిన టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. ఇలా పదవుల కోసం పోటీపడుతున్న కూటమి పార్టీల ఆశావాహులు వారికున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం అండదండలున్నాయన్న భరోసాతో భాను ప్రకాష్ రెడ్డి ఉంటే బిజెపి మరో రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ కూడా నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు న్నాయని కిరణ్ రాయల్ ధీమాతో ఉన్నారు. ఇక టిడిపిలోనూ అందరూ చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులు తమకే ఉన్నాయని నామినేటెడ్ పదవుల కోసం ఆశ పడుతున్నారు. ఇప్పటికే పార్టీల అధిష్టానాలకు బయోడేటాలను సమర్పించిన మూడు పార్టీల ముఖ్య నేతలు నామినేటెడ్ పదవుల జాబితాలో తమ పేరు ఉంటుందా… లేదా అన్న టెన్షన్ మాత్రం టెన్షన్ తో బీపీ లు పెంచుకుంటున్నారు.