నేటి బాలలే రేపటి పౌరులు.. వారి ఎదుగుదల సరిగా ఉంటేనే.. భవిష్యత్తులో సమాజం సురక్షితంగా ఉంటుంది అంటారు పెద్దలు. ఇక సమాజ శ్రేయస్సులో కీలక పాత్ర పోషించేది విద్య. అయితే నేటి కాలంలో చదువు అనేది అత్యంత ఖరీదైన ఖర్చుగా మారింది. ఒకప్పుడు చదువుకునే వారు.. మరి ఇప్పుడు చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. నాణ్యమైన విద్య కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి అంత ఖర్చు పెట్టినా.. ఫలితం బాగానే ఉందా అంటే.. నామమాత్రమే అనే సమాధానం వినిపిస్తుంది. విద్యావ్యవస్థలో ఎంతటి నిర్లక్ష్య ధోరణి ఉందో ఈ వార్త చూస్తే అర్థం అవుతుంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఎగ్జామ్ పేపర్లను ఫ్యూన్ చేత కరక్షన్ చేయిస్తున్నారంటే.. పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు..
ఈ సంఘటన మధ్యప్రదేశ్, నర్మదాపురం జిల్లాలో చోటు చేసుకుంది. భగత్ సింగ్ ప్రభుత్వ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫ్యూన్ చేత విద్యార్థులు పరీక్ష పేపర్లు దిద్దించిన వార్త స్థానికంగా కలకలరం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆగ్రహం పట్టలేక స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్‌దాస్ నాగవంశీ వద్దకు వెళ్లి.. ఫ్యూన్ చేత పరీక్ష పేపర్లు దిద్దిస్తే.. తమ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న యూత్ అఫైర్స్ అండ్ కోపరేటీవ్స్ మినిస్టర్ విశ్వాస్ సారంగ్ కాలేజీ ప్రిన్సిపాల్, నోడల్ ఆఫీసర్‌ని సస్పెండ్ చేసినట్లు తెలిపాడు. అంతేకాక పేపర్ కరెక్షన్ విధులు ఎవరికైతే అప్పగించారో.. ఆ లెక్షరర్, ఫ్యూన్‌ని కూడా సస్పెండ్ చేశామని.. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపాడు.
ఈ సందర్భంగా సారంగ్ మాట్లాడుతూ.. “మా ప్రభుత్వం విద్యార్థులందరికి నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అనేక చర్యలు కూడా తీసుకుంటున్నాము. అయితే జరిగిన సంఘటన దురదృష్టవశాత్తు జరిగింది. అయినప్పటికి అందుకు బాధ్యులైన వారిని క్షమించే ప్రసక్తే లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని” తెలిపాడు.
ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. “పేపర్ దిద్దే పనిని గెస్ట్ లెక్షరర్‌కి అప్పగించాము. కానీ అతడా పనిని ఫ్యూన్‌కి అప్పగిస్తాడని అనుకోలేదు” అని చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన గురించి తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు ఇలా చేస్తే.. ఇంకా పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు.