జగన్ ను విమర్శించిన పాస్టర్ మృతి.. విచారణకు చంద్రబాబు ఆదేశం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్‌.. ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే.. ఆయన మృతి ప్రమాద శాత్తు జరిగింది కాదని..


పక్కా ప్లాన్‌తోనే ఆయనను చంపేశారని.. క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన జరిగి.. గంటలు గడిచినా.. విషయం వెలుగు చూడలేదని.. దీనివెనుక కుట్ర ఉందని సంఘాల పాస్టర్లు ఆరోపించారు. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌.. ఘటనపై విచారణకు ఆదేశించారు.

పాస్టర్ ప్రవీణ్‌కుమార్ మృతిపై స్వయంగా సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులోనే ఉన్న డీజీపీతో చర్చించారు. ఈ ఘటనను అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని.. వెనుక కుట్ర కోణం ఉంటే వెలికి తీయాలని కూడా సూచించారు. తక్షణమే పాస్టర్‌ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పాలని.. స్థానిక నాయకులను ఆదేశించారు. కాగా.. మరోవైపు మంత్రి నారా లోకేష్‌.. కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలను అన్ని కోణాల్లో పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.

ఎవరీ పాస్టర్‌?

పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌.. స్థానికంగానే కాకుండా.. యూట్యూబ్‌లోనూ తన వీడియోల ద్వారా క్రైస్తవ సమాజాన్ని చైతన్య పరుస్తున్నారు. రాజకీయాలకు-క్రైస్తవానికి ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా జగన్ పాలనలో ఎస్సీల్లో విభజన తీసుకువచ్చారని.. ఇది మున్ముందు ప్రమాదకరమని అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగని ఆయన ఎక్కడా ఇతర పార్టీలను భుజాన మోయలేదు. ఎవరినీ విమర్శించలేదు. పొగడలేదు. కానీ.. జగన్ ప్రభుత్వ విధానాలను మాత్రం ఎండగట్టారు. పాస్టర్లకు రూ.5000 చొప్పున ఇవ్వడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ప్రజల సొమ్మును ఇలా మత పరమైన కార్యక్రమాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఇది క్రైస్తవానికి కూడా మంచిది కాదన్నారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయమని పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు చేశారు.

ఏం జరిగింది?

రాజమండ్రికి చెందిన ప్రవీణ్‌కుమార్‌.. ఇటీవల తన బుల్లెట్‌పై హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో రాజమండ్రికి సమీపంలోని కొంతమూరు గ్రామం వద్ద.. హైవేను దాటి బుల్లెట్ కిందికి దూసుకుపోయింది. ఈ క్రమంలో బుల్లెట్ ఆయనపై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఇది ప్రమాదం కాదని.. వెనుక నుంచి వేరే వాహనం ఢీ కొట్టి ఉంటుందని.. రాజకీయ ప్రమేయం కూడా ఉండి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆరోపిస్తున్నారు.