ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
లడ్డూ తయారీ కోసం వినియోగించే నెయ్యి తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదనలు మరింత బలపడ్డాయి.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వై సత్యకుమార్ సహా పలువురు జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపై ఓ ఉద్యమమే సృష్టించారు.
పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పునకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటూ దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి మెట్లను సైతం శుభ్రపరిచారాయన. ఇంకో రెండు రోజుల్లో ఈ దీక్ష ముగియాల్సి ఉంది.
చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవాలేమిటనేది దేశ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కల్తీ జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. చంద్రబాబును తప్పుపట్టింది. రాజకీయాలకు కనీసం దేవుళ్లనయినా దూరంగా పెట్టాలంటూ హితబోధ చేసింది.
దీనిపై తిరుపతికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్షంలో ఉన్న పవన్ కల్యాణ్‌కు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని, రాజకీయాల్లోకి దేవుళ్లను లాగొద్దంటూ చంద్రబాబుకు సుప్రీంకోర్టు హితవు పలికిందని గుర్తు చేశారు.
అలాంటప్పుడు ఈ ప్రాయశ్చిత్త దీక్ష అవసరమా? అంటూ గురుమూర్తి ప్రశ్నించారు. అసలు కల్తీనే జరగనప్పుడు దీక్ష గానీ, తిరుపతిలో బహిరంగ సభను గానీ నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువుల మనోభావాలను మరోసారి కించపరిచినట్టవుతుందని చెప్పారు.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణలో ఉన్న దశలో ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఎలా ప్రాయశ్చిత్త దీక్ష చేయగలుగుతారని గురుమూర్తి నిలదీశారు. చంద్రబాబులాగే కోట్లాదిమంది హిందువులు, ప్రజలను మరోసారి తప్పుడు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారా? అంటూ మండిపడ్డారు.