మనసంతా పోలీస్‌శాఖపైనే.. అసలు పవన్‌ కల్యాణ్ ఆలోచనేంటి..? సర్వత్రా చర్చ

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్ర పోలీసులపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్, రోడ్డు భద్రత వంటి అంశాలపై ఆయన వ్యాఖ్యలు, పోలీసుల చర్యలపై ఆయన ప్రతిస్పందనలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఈ చర్యల వెనుక ఉద్దేశం ఏంటి..? రాజకీయ వ్యూహమా.. లేక లేదా నిజమైన ఆందోళనా.. ఏమిటనేది ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా హాటటాపిక్ గా మారింది.

ఆడబిడ్డల జోలికొస్తే అంతుచూస్తా.. పిచ్చిపిచ్చి పోస్టులు పెడితే పాతరేస్తా.. మత్తుగాళ్ల తుప్పురేగ్గొడతా. అక్రమాలకు పాల్పడితే అడ్రస్‌ లేకుండా చేస్తా.. ఇలాంటి డైలాగ్స్‌ కామన్‌గా డీజీపీనో లేక హోంమినిస్టర్‌ నోటి నుంచో వింటుంటాం. కానీ ఏపీలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నోట పదేపదే వినిపిస్తున్న డైలాగులివి. గతకొన్ని రోజులుగా పవన్‌.. పోలీస్‌శాఖపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. డ్రగ్స్‌ దగ్గర్నుంచి రోడ్‌ సేఫ్టీ వరకు పోలీస్‌శాఖకు సంబంధించిన ప్రతి అంశంపైనా పవన్‌ మాట్లాడుతున్నారు. తప్పులెత్తి చూపుతున్నారు.. అలాగే ఎవరైనా విమర్శిస్తే సపోర్ట్‌ చేస్తున్నారు. మొత్తంగా.. పవన్‌ మనసంతా పోలీస్‌శాఖపైనే అన్నట్లుగా ఉంది. మరి హోంశాఖలో పవన్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ దేనికి..? అసలు పవన్‌ ఆలోచనేంటి.. అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఏదైనా ఐ డోంట్‌ కేర్… తప్పుంటే ప్రశ్నిస్తా… ఫలితం వచ్చేదాకా పనిపడతా అన్నట్లుగా యమా స్పీడు చూపిస్తున్నారు. పవర్‌ కాదు ముఖ్యం… ప్రజాశ్రేయస్సే లక్ష్యమంటూ దూకుడు చూపిస్తున్నారు. అందులోభాగంగానే గతకొన్ని రోజులుగా హోంశాఖపైనే ఫుల్‌ ఫోకస్డ్‌గా మాట్లాడుతున్నారు. ఇటీవల హోంశాఖ మీద కూడా పవన్ ఏ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారో…! అందరికీ తెలిసిందే.. తాను హోంమినిస్ట్రీ తీసుకుంటే సిచ్చేవేషన్‌ మరోలా ఉంటుందన్న రేంజ్‌కి వెళ్లారు. ఇక అప్పట్నుంచి హోంశాఖకు సంబంధించిన ప్రతి అంశంపైనా పవన్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. పొలిటికల్ కొట్లాటల దగ్గర్నుంచి లేటెస్ట్‌గా డ్రగ్స్‌ ఇష్యూ వరకు… ప్రతిదానిపైనా వెంటనే రియాక్ట్‌ అవ్వడమే కాదు పోలీసుల యాక్షన్‌పైనా ఆరా తీస్తున్నారు.

లేటెస్ట్‌గా డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పవన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు-ఘోరాలపై గ్రౌండ్‌ లెవల్‌లో చర్చించారు. సోషల్‌ మీడియా పోస్టులు, అరెస్టులపైనా ఆరా తీశారు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యపైనా చర్చలు జరిపారు. ఇలా ఒక్కటేంటి… రాష్ట్రంలో శాంతిభద్రతలపై క్షుణ్ణంగానే డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇటు డ్రగ్స్‌పైనా ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు డిప్యూటీ సీఎం. మత్తుగాళ్ల తుప్పురేగ్గొట్టడమే కాదు.. మత్తుపదార్ధాలను సప్లై చేస్తున్న కంత్రిగాళ్ల అంతుచూస్తానంటున్నారు. గంజాయి సాగు చేస్తే గుంజి కొడతాంటూ మాటల మంటలే కాదు.. ట్వీట్లతోనూ మాదకద్రవ్యాలపై మండిపడుతున్నారు. గతంలో విశాఖ పోర్టులో దొరికిన భారీ కొకైన్‌ను గుర్తుచేస్తూ.. డ్రగ్స్‌ కంట్రోల్‌కి సమగ్ర ప్రణాళిక కావాలన్నారు డిప్యూటీ సీఎం.

అంతకుముందు సోషల్‌ మీడియా పోస్టులపై పవన్‌ ఎలా ఫైర్‌ అయ్యారో… అవుతూనే ఉన్నారో ఇప్పటికీ చూస్తున్నాం. మురికి పోస్టులు పెడితే మడపెడతాం అన్న రేంజ్‌లో పవన్‌ వార్నింగులిస్తున్నారు. పోలీసులు కేర్‌ఫుల్‌గా ఉండాలి.. కన్నింగ్‌గాళ్ల కహానీ తేల్చాలంటూ పదేపదే మాట్లాడుతున్నారాయన. అలాగే అంతకుముందు ఆడవాళ్ల అఘాయిత్యాలపైనా నిప్పులు చెరిగారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వెల్లగక్కారు… ఎవరదేని చూడొద్దు… ఎక్కడినుంచి వచ్చారన్నది పట్టించుకోవద్దు… తప్పు చేస్తే తాటతీయాల్సిందేనన్నారు. ఇటు రోడ్డు ప్రమాదాలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలంటూ స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పోలీసుల తీరుపై మండిపడుతున్న పవన్‌… విపక్షాలు పోలీసులపై విమర్శలు గుప్పిస్తే వాటిని తిప్పికొడుతూ పోలీసులనూ వెనకేసుకొస్తున్నారు కూడా..

మొత్తంగా.. గతకొన్ని రోజులుగా పవన్‌ మాట్లాడుతున్న ప్రతి అంశం హోంశాఖకు సంబంధించిందే. దీంతో పవన్‌ టార్గెట్‌ ఏంటి..? లా అండ్‌ ఆర్డర్‌పై ఎందుకుంతా ఫోకస్డ్‌గా ఉన్నారు..? ఏం చేయాలనుకుంటున్నారు…? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.