ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. విద్యార్థులకు ఇచ్చిన మాటను 10 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. సొంత నిధులతో ఓ పాఠశాలకు 25 కంప్యూటర్లు, పుస్తకాలు, ఇతర ఫర్నిచర్‌ను అందించారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ 2.0 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా స్కూల్‌లో అందుబాటులో ఉన్న లైబ్రరీ, ల్యాబ్, పాఠశాల గదులను పరిశీలించారు.
ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ”పాఠశాలలో లైబ్రరీ చూశాను… చిన్న లైబ్రరీ ఉంది, బీరువాలు ఉన్నాయి… కానీ ఇంత మంది విద్యార్థులకు సరిపడ పుస్తకాలు లేవని అనిపించింది. 10 కంప్యూటర్‌లు మాత్రమే ఉన్నాయి. నా వైపు నుంచి ఒక ఫుల్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తాను. విద్యార్థులలో క్రియేటివ్ ట్యాలెంట్ కావాలి… దానికి స్వయంశక్తితో చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. టీచర్లు నేర్పించేది కాకుండా అదనంగా చదువుకోవాలి. పాఠశాలకు మంచి పుస్తకాలు పంపిస్తాను… తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలోని మంచి పుస్తకాలను సెలక్ట్ చేసి పంపుతాను. 25 కంప్యూటర్లు అందిస్తాను” అని చెప్పారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ మాట ప్రకారం కేవలం 10 రోజుల్లోనే శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు, పుస్తకాలు, ఫర్నిచర్ బహుకరించారు. విద్యార్థుల కోసం పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతోపాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు.
సోమవారం చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మాజీ శాసన సభ్యులు కిలారి రోశయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు.
ఇక, మొదటి విడత మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచన మేరకు అధునాతన మోడల్ కిచెన్ ఏర్పాటు చేయించారు.



































