గేమ్ చేంజర్ సినిమా విడుదల కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ సైతం ఉంది. ఇప్పటికే ఏపీలో ఈ చిత్రానికి సంబంధించి మెగా ఈవెంట్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 40 ఎకరాల విస్తీర్ణంలో నేడు మెగా ఈవెంట్ జరగనుంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మెగా అభిమానులు. ఈవెంట్ కు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హాజరవుతుండడంతో పోలీసులు భద్రతాచార్యులు చేపడుతున్నారు. ప్రముఖులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది.
* మెగాస్టార్ హాజరు?
అయితే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మెగా బ్రదర్స్ హాజరు కాబోతున్న నేపథ్యంలో భారీగా అభిమానులు తరలిరానున్నారు. అందుకే మెగా అభిమానులు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిని విజయవంతం చేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఈవెంట్లో ఏం చెప్పబోతున్నారు అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అటు తరువాత సినీ పరిశ్రమకు చెందిన కార్యక్రమం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హాజరవుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది.
* పవన్ ఆ ప్రకటన చేస్తారా?
పవన్ ప్రసంగం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లబ్ధి కలిగించేలా పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తారని కూడా సమాచారం. ఇదే వేదికపై కొన్ని రకాల రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం.. కష్టనష్టాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం వల్ల ఇండస్ట్రీకి మేలు కలిగేలా ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నారు సినీ పెద్దలు. మరి పవన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.