పేటీఎం భారీ ఆఫర్.. ప్రతి పేమెంట్‌కు ‘గోల్డ్ కాయిన్స్’

 ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది సాధారణ చెల్లింపులను దీర్ఘకాలిక పొదుపు మంత్రంగా చేస్తుందని కంపెనీ చెబుతోంది.


‘గోల్డ్ కాయిన్స్ ‘ పేరుతో గురువారం కంపెనీ ప్రారంభించిన ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు పేటీఎం యాప్‌లో చేసే ప్రతి చెల్లింపుపైనా డిజిటల్ బంగారాన్ని సంపాదించే అవకాశం కల్పించే రివార్డ్ మెకానిజం. రోజువారీ లావాదేవీల నుంచి సంపదను పోగు చేసుకోవడానికి, దేశంలో పసిడిపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేందుకు ఈ చొరవ ఉపయోగపడుతుందని పేటీఎం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

పేటీఎం వెల్లడించిన దాని ప్రకారం, యూపీఐ లావాదేవీలు, క్యూఆర్-ఆధారిత స్కాన్ లేదా పే లావాదేవీలు, రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపులు, డబ్బు బదిలీల వరకు అన్ని అర్హత గల చెల్లింపులపైనా వినియోగదారులు హామీతో కూడిన బంగారు నాణేలను పొందుతారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసిన చెల్లింపులపై కూడా బంగారు నాణేలను సంపాదించవచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రెట్టింపు రివార్డులను సంపాదించవచ్చని పేటీఎం స్పష్టం చేసింది.

దేశంలో ప్రజలు ప్రస్తుతం 3.8 ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 340 లక్షల కోట్ల) విలువైన బంగారాన్ని కలిగి ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది.. ఇది దేశ జీడీపీలో దాదాపు 89 శాతమని కంపెనీ పేర్కొంది. ఇది బంగారానికి సంబంధించి తరతరాలుగా ఉన్న ఆకర్షణను ప్రతిబింబిస్తుంది. కాబట్టి ‘గోల్డ్ కాయిన్స్’ ఫీచర్ సాంప్రదాయ క్యాష్‌బ్యాక్‌కు మరింత అర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. కస్టమర్లు తమ రివార్డులను కాలక్రమేణా నిల్వ చేసుకోవచ్చు, భవిష్యత్తులో ఈ గోల్డ్ కాయిన్స్‌ను డిజిటల్ బంగారంగా మార్చుకోవచ్చు. చెల్లింపుల తర్వాత వినియోగదారులు యాప్‌లో స్క్రాచ్ కార్డ్‌ను స్క్రాచ్ చేయడం ద్వారా వారు పొందిన బంగారు నాణేలను చూసుకోవచ్చు. ఈ నాణేలను యాప్‌లోనే నేరుగా డిజిటల్ బంగారంగా మార్చవచ్చు.

వినియోగదారులు బంగారు నాణేలను తనిఖీ చేయడం, మార్చుకోవడం ఎలాగంటే..

* పేటీఎం యాప్‌లో హోమ్ స్క్రీన్‌పై ‘గోల్డ్ కాయిన్స్’ గుర్తును ప్రెస్ చేయాలి

* చెల్లింపుల ద్వారా వచ్చిన మొత్తం బంగారు నాణేల బ్యాలెన్స్‌ను చూడవచ్చు.

* డిజిటల్ బంగారం కోసం నాణేలను రీడీమ్ చేయడానికి ‘కన్వర్ట్ టూ రియల్ గోల్డ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

మొత్తం డిజిటల్ బంగారం ఎంత ఉందో తెలుసుకోవడానికి..

* పేటీఎం యాప్‌లో హోమ్ స్క్రీన్‌పై ‘పేటీఎం గోల్డ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* డిజిటల్ గోల్డ్ అకౌంట్‌లో చూపించే బ్యాలెన్స్‌ను తనిఖీ చేయాలి.

సాధారణ డిజిటల్ లావాదేవీలను సంపద సృష్టికి అవకాశాలుగా మార్చడం ద్వారా వినియోగదారులకు శాశ్వత విలువను అందించే ప్రయత్నమే ఈ ఫీచర్ అని పేటీఎం పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.